టీటీడీకి ఆర్బీఐ రూ. 3 కోట్ల జరిమానా

దేశంలోనే అత్యంత సంపన్నమైన ధార్మిక సంస్థగా గుర్తింపు ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 3 కోట్ల రూపాయల జరిమానా విధించింది. విదేశీ మారకద్రవ్యానికి సంబంధించిన అంశంపై టీటీడీకి ఆర్బీఐ రూ. 3 కోట్ల జరిమానా వేసిందని, ఆ మొత్తాన్ని చెల్లించామని టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
 
భక్తులు హుండీలో వేసిన విదేశీ కరెన్సీ విషయంలో ఈ సమస్య తలెత్తింది. విదేశీ కరెన్సీని బ్యాంకులో జమచేసే సమయంలో విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ)   నిబంధనలు ఉల్లంఘించినందుకు జరిమానా విధించారని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. టీటీడీకి ఉన్న ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్స్‌ 2018తోనే ముగిసింది. అయితే, దీన్ని ఇప్పటివరకు రెన్యువల్‌ చేసుకోలేదు. దీంతో ఈ సమస్య తలెత్తిందని సుబ్బారెడ్డి వివరించారు.

రూ. 3 కోట్ల జరిమానాను రెండు విడతల్లో చెల్లించామని సుబ్బారెడ్డి తెలిపారు. లైసెన్సును రెన్యువల్‌ చేయాల్సిందిగా ఆర్బీఐకి విజ్ఞప్తి చేసినట్లు ఆయన వెల్లడించారు. హుండీ కానుకల ద్వారా మొత్తం రూ. 30 కోట్ల విలువైన విదేశీ కరెన్సీ వచ్చిందని ఆయన తెలిపారు. మూడేళ్ల పాటు జమ చేసిన రూ. 26 కోట్ల విలువైన విదేశీ కరెన్సీపై ఆర్బీఐ జరిమానా వేసినట్లు తెలుస్తోంది.

మరోవైపు వేసవిలో భక్తులకు ఇబ్బందులు లేకుండా విస్తృత ఏర్పాట్లు చేయనున్నట్లు టీటీడీ ఛైర్మన్‌ తెలిపారు. తిరుమలలో వేసవి ఏర్పాట్లపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఏప్రిల్ తొలి వారం నుంచి నడక మార్గంలో వచ్చే భక్తులకు దివ్యదర్శన టోకెన్లు జారీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.

 
ఏప్రిల్‌ 1 నుండి తిరుమల నడకమార్గాల్లో దివ్యదర్శనం టోకెన్లను ప్రయోగాత్మకంగా జారీ చేస్తున్నట్లు సుబ్బారెడ్డి తెలిపారు.  భక్తుల కోరిక మేరకు ఏప్రిల్‌ 1వ తేదీ నుండి ప్రయోగాత్మకంగా వారం రోజుల పాటు అలిపిరి మార్గంలో 10 వేలు, శ్రీవారిమెట్టు మార్గంలో 5 వేల దివ్యదర్శనం టోకెన్లు మంజూరు చేస్తామని, ఆ తరువాత భక్తుల సూచనలను పరిగణనలోకి తీసుకుని తగిన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
 
ఫేస్ రికగ్నిషన్  సాంకేతికతతో తిరుమలలో భక్తులకు పారదర్శకంగా వసతి సౌకర్యం కల్పిస్తామని సుబ్బారెడ్డి తెలిపారు.  ఏప్రిల్‌ 15 నుండి జులై 15వ తేదీ వరకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటాయని, సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ విఐపి బ్రేక్‌, శ్రీవాణి, టూరిజం కోటా, వర్చువల్‌ సేవలు, రూ.300/` దర్శన టికెట్లు తగ్గిస్తున్నామని ప్రకటించారు.
 
మూడు నెలల పాటు విఐపిలు సిఫారసు లేఖలను తగ్గించాలని ఛైర్మన్ విజ్ఞప్తి చేశారు. సామాన్య భక్తులు శ్రీవారి దర్శనం కోసం ఎక్కువ సమయం వేచి ఉండకుండా త్వరితగతిన దర్శనం కల్పించడానికి అవకాశం కలుగుతుందన్నారు. ఆలయ మాడ వీధులు, భక్తుల రద్దీ ఉన్న ప్రాంతాల్లో భక్తులకు కాళ్లు కాలకుండా కూల్‌ పెయింట్‌ వేస్తామని తెలిపారు.

తిరుమలలో ప్రస్తుతం 7500కు పైగా గదులు ఉన్నాయని, వీటిలో 40 వేల మందికి సరిపడా వసతి అందుబాటులో ఉందని, దాదాపు 85 శాతం గదులు సామాన్య భక్తుల కోసమే కేటాయించడం జరిగిందని పేర్కొన్నారు.

మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, పాత అన్నదానం కాంప్లెక్స్‌, పిఏసి`2, 4తోపాటు నారాయణగిరి ఉద్యానవనాల్లోని క్యూలైన్లు, కంపార్ట్‌మెంట్లలో అన్నప్రసాదాలు పంపిణీ చేస్తామని తెలిపారు. అన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో జలప్రసాద కేంద్రాల ద్వారా భక్తులకు సురక్షితమైన తాగునీరు అందుబాటులో ఉంచుతాం. మెరుగ్గా పారిశుద్ధ్య ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు.