ఏపీలో 15 ఆశావహ మండలాల ఎంపిక

కేంద్రం ప్రవేశపెట్టిన ఆశావహ మండలాల అభివృద్ధి కార్యక్రమం కింద ఆంధ్రప్రదేశ్‌లోని 7 జిల్లాల పరిధిలోగల 15 మండలాలను ఎంపిక చేసినట్లు కేంద్ర మంత్రి రావ్ ఇందర్‌జిత్‌ సింగ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 2023 జనవరిలో ఆశావహ మండలాల (ఏస్పిరేషనల్ బ్లాక్స్) కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఎంపీ విజయసాయిరెడ్డికి ఇచ్చిన సమాధానంలో పేర్కొన్నారు.

కర్నూలు జిల్లాలోని చిప్పంగి, మద్దికెర, హొలగుండ,  అల్లూరి సీతారామరాజు జిల్లాలోని వై. రామవరం, మారేడుమిల్లి, గంగవరం, అన్నమయ్య జిల్లాలోని కురబలకోట, లక్కిరెడ్డిపల్లె, కోడూరు,  వైఎస్సార్ జిల్లాలోని చింతకొమ్మదిన్నె, జమ్మలమడుగు, ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం, పెనుగంచిప్రోలు, ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెం, పార్వతీపురం మన్యం జిల్లాలోని భామిని మండలాలలో ఆశావహ మండలాల అభివృద్ధి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

దేశంలో అభివృద్ధికి నోచుకోని 500 మండలాల్లో సామాజిక అభివృద్దిని వేగవంతం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఆశావహ మండలాల కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా 2018 నుంచి వివిధ జిల్లాల్లో అమలు చేస్తున్న ఆశావహ జిల్లాల కార్యక్రమం ఆధారంగా ఆశావహ మండలాల కార్యక్రమానికి రూపకల్పన చేసినట్లు మంత్రి తెలిపారు.

ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు, సూచనలకు అనుగుణంగా  అభివృద్దిలో వెనకబడ్డ మండలాలను ఆశావహ మండలాల కింద గుర్తించినట్లు ఆయన వివరించారు. ఆరోగ్యం, పౌష్టికాహారం, విద్య, వ్యవసాయం, నీటి వనరులు, నైపుణ్యాభివృద్ధి, ఆర్థిక సమ్మిళత్వం, మౌలిక వసతులు, సమగ్ర సామాజిక అభివృద్ధి వంటి ప్రధాన రంగాల్లో సామాజిక-ఆర్థిక సూచికల ఆధారంగా జరిగే పర్యవేక్షణ పైనే ఈ కార్యక్రమం దృష్టి సారిస్తుందని కేంద్రమంత్రి చెప్పుకొచ్చారు.