నేటి నుండే విశాఖలో జీ–20 సదస్సు పట్టణీకరణపై దృష్టి

విశాఖ మహా నగరం జీ–20 సదస్సుకు సిద్ధమైంది. మార్చి 28వ తేదీ నుంచి జీ–20 దేశాల రెండో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వర్కింగ్‌ గ్రూప్‌ (ఐడబ్ల్యూజీ) సమావేశాలు జరగనున్నాయి. ఈ సదస్సు వన్‌ ఎర్త్, వన్‌ ఫ్యామిలీ, వన్‌ ఫ్యూచర్‌ అనే థీమ్‌తో 31 వరకు విశాఖలో జరగనుంది.

నగరంలోని రాడిసన్‌ బ్లూ హోటల్‌లో నాలుగు రోజులపాటు జరిగే ఈ సదస్సుకు జీ–20 దేశాలతో పాటు ఐరోపా దేశాలకు చెందిన 57 మంది ప్రతినిధులు ఇప్పటికే విశాఖ చేరుకున్నారు. ఇప్పటికే ఈ సమావేశాల కోసం జిల్లా అధికార యంత్రాంగం విశాఖ సాగర తీరాన్ని భీమునిపట్నం వరకూ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతూ రూ.150 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టింది.

జీ–20 సదస్సు తొలిరోజు సాయంత్రం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ హాజరుకానున్నారు. సదస్సులోని ప్రతినిధులతో ముఖాముఖి మాట్లాడి అనంతరం గాలా డిన్నర్‌లో పాల్గొంటారు. రాత్రికి ముఖ్యమంత్రి తిరిగి తాడేపల్లికి పయనమవుతారు. రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలను సీఎం జగన్ వివరించనున్నారు. ఈ సదస్సు ద్వారా విశాఖకు ప్రపంచస్థాయి గుర్తింపు లభిస్తుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.

దేశంలోని వివిధ నగరాలు, పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు అమలు చేసే ప్రాజెక్టులు, వాటిని పిపిపిలో ఎలా చేపట్టాలి? రెవెన్యూను మున్సిపాల్టీలు ఎలా పెంచుకోవాలి? బ్యాంకుల నుంచి రుణం పొందాలంటే ఎలాంటి ఆస్తి పన్ను, యూజర్‌ ఛార్జీలు, ఇతరత్రా వడ్డనలకు సంబంధించి ఏ తరహా చర్యలు తీసుకోవాలన్నదే ప్రధాన అజెండాగా కనిపిస్తోంది.

పట్టణాల్లో పెరుగుతున్న జనాభా అవసరాలు నెరవేరేందుకు నగరాల్లో సుస్థిర ఆర్థిక ప్రగతికి పిపిపి ప్రాజెక్టులు అత్యంత కీలకమంటూ ఈ జి-20 సమావేశాల్లో చర్చించనున్నట్లు తెలుస్తోంది. పట్టణాలు, నగరాల్లో పలు ప్రాజెక్టులకు సాయం అందించే ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌, ఐఎంఎఫ్‌, ఒఇసిడి దేశాల ప్రతినిధులు జి20లో కీలక పాత్ర పోషిస్తున్నారు.

 నగర వాసులపై ఆస్తి పన్ను, సేవల పన్నులు వంటివి అజెండా కానున్నాయి. పట్టణాలు అభివృద్ధి కావాలంటే ఫండింగ్‌ ఉండాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేవే కాకుండా సొంతంగా వనరులను కూడబెట్టుకోవడం ఎలా? అన్నది జి20 సమావేశాల్లో 28, 29 తేదీల్లో ప్రధానంగా చర్చించనున్నారు. దేశంలోని సూరత్‌, విశాఖ, నాగపూర్‌లో బాగానే పన్నుల వసూళ్లు జరుగుతున్నట్లు జి-20 దేశాలకు ప్రస్తుతం నాయకత్వం వహిస్తోన్న భారత్‌ ప్రతినిధులు భావిస్తున్నట్లు సమాచారం.

పట్టణీకరణ ప్రపంచంలో ఒక ట్రెండ్‌

ప్రపంచంలో పట్టణీకరణ ఒక ట్రెండ్‌గా మారిందని, దీనిపై సుదీర్ఘంగా జి-20 సమావేశాల్లో చర్చించనున్నామని భారతదేశ జి-20 ప్రతినిధి, ఐఎఎస్‌ మాజీ అధికారి సోలోమన్‌ ఆరోకియా రాజ్‌ చెప్పారు.  మంగళవారం మధ్యాహ్నం ఐడబ్ల్యుజి జి-20 సమావేశాలు విశాఖ నగరంలోని రాడిసన్‌ బ్లూ లో ప్రారంభం కానున్నాయని, 20 దేశాలు పాల్గంటాయని, 63 మంది ప్రతినిధులకుగానూ 57 మంది ట్రావల్‌ మ్యాప్‌ను తమకు అందజేశారని తెలిపారు.

ప్రపంచ జనాభాలో 50 శాతం పట్టణాలకు తరలిపోయిందని, దీనివల్ల 80 శాతం ప్రపంచ జిడిపి పట్టణాల నుంచే వస్తుందని చెప్పారు. 2050 నాటికి ఇది 70 శాతానికి చేరుతుందని పేర్కొన్నారు. ఈ ట్రెండ్‌కనుగుణంగా మౌలిక వసతులు పెంచుకునే దిశగా జి-20 దేశాలు వ్యూహాలు, లక్ష్యాలను నిర్దేశించుకుంటాయని చెప్పారు.

జి-20 ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వర్కింగ్‌ గ్రూప్‌ కాన్‌క్లేవ్‌ ఈ ఏడాది జనవరిలో పూణెలో జరిగిందని, ఇది రెండో సమావేశమని చెప్పారు. ఈ నెల 30న ఆయా దేశాల ప్రతినిధులకు శిక్షణా కార్యక్రమం, 31న దేశంలోని మున్సిపల్‌ కమిషనర్లు, యూనివర్సిటీల వైస్‌ ఛాన్సలర్‌లు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, ఐఎంఎఫ్‌, వరల్డ్‌ బ్యాంక్‌, పిపిపి పెట్టుబడులకు సిద్ధమయ్యే సంస్థలతో అవగాహన కార్యక్రమం జరగనున్నాయని వివరించారు. ఈ నెల 31న యూనివర్సిటీల విసిలు, విద్యార్థులతో రాడిసన్‌ బ్లూలో ఇంటరాక్షన్‌ ఉంటుందని తెలిపారు.