మహిళల ప్రీమియర్‌ లీగ్‌ తొలి టైటిల్‌ ముంబై కైవసం

సీజన్‌ ఆరంభం నుంచి నిలకడగా రాణించిన ముంబై ఇండియన్స్‌ జట్ మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) తొలి టైటిల్‌ చేజిక్కించుకుంది.   బ్రౌబర్న్ స్టేడియం వేదికగా ఆదివారం దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఫైనల్‌లో ముంబయి ఇండియన్స్ ఘనవిజయం సాధించింది. 132 పరుగుల లక్ష్యాన్ని కేవలం 3 వికెట్లు కోల్పోయి 19.3 ఓవర్లలో ఛేదించింది. ఫలితంగా డబ్ల్యూపీఎల్ ఛాంపియన్‌గా అవతరించింది.

 చివరి ఓవర్‌ వరకు హోరాహోరీగా సాగిన తుదిపోరులో ఢిల్లీని చిత్తుచేసిన ముంబై సగర్వంగా ట్రోఫీ అందుకుంది. మొదట బౌలింగ్‌లో మాథ్యూస్‌, వాంగ్‌ ఢిల్లీ పనిపట్టగా, బ్యాటింగ్‌లో స్కీవర్‌తో పాటు హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ చెలరేగింది.  ముంబయి బ్యాటర్లలో న్యాట్ స్కైవర్ బ్రంట్(60) చివరి వరకు పోరాడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ కౌర్ 37 పరుగులతో రాణించింది. దిల్లీ బౌలర్లలో రాధ యాదవ్, జెస్ జొనాసెన్ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.

టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌ (35; 5 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌ కాగా.. చివర్లో శిఖ పాండే (17 బంతుల్లో 27 నాటౌట్‌; 3 ఫోర్లు, ఒక సిక్సర్‌), రాధ యాదవ్‌ (12 బంతుల్లో 27 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) విలువైన పరుగులు జోడించారు.

ముంబై బౌలర్లలో హీలీ మాథ్యూస్‌ నాలుగు ఓవర్లలో రెండు మెయిడిన్లు వేసి ఐదు పరుగులే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టగా.. ఇస్సీ వాంగ్‌ 3, అమెలియా కెర్‌ రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు.

 అనంతరం లక్ష్యఛేదనలో ముంబై ఇండియన్స్‌ 19.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది. స్కీవర్‌ బ్రంట్‌ (55 బంతుల్లో 60 నాటౌట్‌; 7 ఫోర్లు) అజేయ అర్ధశతకంతో రాణించగా.. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (37; 5 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌ ఆడింది.