సివిల్స్ నియామక పక్రియ ఆరు నెలలు మించకూడదు

సివిల్స్‌ నియామకాల ప్రక్రియను 15 నెలలపాటు కొనసాగించడం వల్ల అభ్యర్థుల జీవితంలో కీలకమైన సమయం వృథా అవడంతోపాటు, వారి ఆరోగ్యంపై ప్రభావం పడుతోందని పార్లమెంటరీ కమిటీ అభిప్రాయపడింది. నియామక ప్రక్రియ నిడివి తగ్గించాలని యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ)కి సూచించింది.

సివిల్స్‌ పరీక్షలకు చాలా తక్కువమంది హాజరవడానికి కారణాలను పరిశీలించాలని నిర్దేశించింది. ఐఏఎస్‌, ఐఎ్‌ఫఎస్‌, ఐపీఎస్‌ తదితర అధికారుల నియామకానికి యూపీఎస్సీ ఏటా ప్రిలిమినరీ, మెయిన్‌, ఇంటర్వ్యూ అనే మూడు దశల్లో పరీక్షలు నిర్వహిస్తోంది. దీనిపై సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, చట్టం, న్యాయ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ ఓ నివేదికను రూపొందించింది.

ఆ నివేదికను ఇటీవలే పార్లమెంటులో ప్రవేశపెట్టింది. యూపీఎస్సీ అందజేసిన సమాచారం ఆధారంగా నోటిఫికేషన్‌ విడుదల నుంచి తుది ఫలితాల ప్రకటన వరకు సుమారు 15 నెలల సమయం తీసుకుంటున్నట్టు అర్థమవుతోందని ఆ నివేదికలో పేర్కొంది. ఏదేని నియామక ప్రక్రియ సాధారణంగా 6 నెలలు మించకూడదని స్పష్టం చేసింది.

2022-23లో 32.19 లక్షల మంది దరఖాస్తు చేయగా కేవలం 16.82 లక్షల మంది (51.95 శాతం) మాత్రమే పరీక్షకు హాజరయ్యారని కమిటీ తెలిపింది. ఎంపిక ప్రక్రియ సుదీర్ఘంగా ఉండటం కారణంగానే ఎక్కువ మంది హాజరు కావడం లేదని పేర్కొంది. అభ్యర్థుల జీవితంలో కీలకమైన సంవత్సరాలు వృథా కాకూడదని కమిటీ అభిప్రాయపడింది.

ఆ మేరకు నాణ్యతలో రాజీపడకుండానే నియామక ప్రక్రియ వ్యవధిని గణనీయంగా తగ్గించాలని పార్లమెంటరీ కమిటీ సూచించింది. ప్రిలిమినరీ పరీక్ష ‘కీ’ని సివిల్స్‌ ప్రక్రియ మొత్తం పూర్తయ్యాక విడుదల చేస్తున్నారని, ఇది అభ్యర్థులను నిరుత్సాహానికి గురిచేస్తోందని, పారదర్శకతలో రాజీకి ఆస్కారమిస్తోందని ఈ సందర్భంగా కమిటీ ఆక్షేపించింది.

అదేవిధంగా, సివిల్స్ ఎంపికలో ఇంగ్లీష్ మీడియం, ఇంగ్లీష్ మీడియం కానీ విద్యార్థులకు సమాన అవకాశాలు లభిస్తున్నాయా? ఈ అంశంపై ఓ నిపుణుల బృందం ఏర్పర్చి అధ్యయనం చేయాలని సూచించింది.