10 వేల మార్క్‌ను దాటిన యాక్టివ్‌ కరోనా కేసులు

దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి మళ్లీ ఆందోళన కలిగిస్తోంది. అదుపులోనే ఉందనుకున్న మహమ్మారి మరోసారి కోరలు చాస్తోంది. గత కొన్ని రోజులుగా రెండు వేలకు చేరువలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ  వెల్లడించిన వివరాల ప్రకారం.. వరుసగా రెండోరోజు 1,800లకు పైనే కొత్త కేసులు నమోదయ్యాయి.
 
నిన్న ఒక్కరోజే 1,890 కేసులు నమోదయ్యాయి. అయితే, నిన్నటితో పోలిస్తే నేడు కొత్త కేసుల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది. గత 24 గంటల్లో 56,551 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 1,805 కేసులు బయటపడ్డాయి. దీంతో దేశంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,47,05,952కి చేరింది.

ఇక దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య పది వేల మార్క్‌ను దాటింది. ప్రస్తుతం 10,300 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దేశంలో 2020 ఏప్రిల్‌ తర్వాత 2022 నవంబర్‌లో యాక్టివ్‌ కేసుల సంఖ్య పదివేల దిగువకు పడిపోయింది. అప్పటి నుంచి పదివేల మార్క్‌ను దాటడం ఇదే ప్రథమం.

ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 932 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 4,41,64,815కి చేరింది. మహమ్మారి కారణంగా ఆరుగురు మృతి చెందారు. ఛత్తీస్‌గఢ్‌, గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందగా.. కేరళలో ఇద్దరు మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,30,837గా నమోదైంది.

రోజువారీ పాజిటివిటీ రేటు 3.19 శాతంగా ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఇక ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల్లో 0.02 శాతం మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయని తెలిపారు. రికవరీ రేటు 98.79 శాతంగా, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని పేర్కొన్నారు.

ఐదు నెలల తర్వాత వేల సంఖ్యలో కేసులు నమోదు కావడం ఇదే ప్రథమం. ఈ నేపథ్యంలో కేంద్రం హైఅలర్ట్‌ ప్రకటించింది. ఇప్పటికే అత్యధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాలను అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో నేడు రాష్ట్రాలు, కేంద్ర పాలిక ప్రాంతాల ప్రభుత్వాలతో కేంద్రం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనుంది.

 
 వైరస్‌ కట్టడి, పరీక్షల నిర్వహణ, వ్యాక్సినేషన్‌పై రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దిశానిర్దేశం చేయనుంది. కరోనా వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనుంది. కాగా, దేశంలో గుజరాత్‌, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో అత్యధిక కేసులు నమోదవుతున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ గుర్తించింది.