పుదుచ్చేరి బీజేపీ నేతను నరికి చంపిన దుండగులు

కొందరు దుండగులు బైకులపై వచ్చి, నాటు బాంబులు విసిరి హంగామా సృష్టించి  కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో  బీజేపీ నేతను నరికి చంపారు.
హోంమంత్రి ఏ నమశ్శివాయం బంధువైన 45 ఏళ్ల సెంథిల్ కుమార్, ఆదివారం రాత్రి 9 గంటలకు కనువపేటైలోని రద్దీగా ఉండే ప్రాంతంలో ఒక బేకరీ వద్ద నిల్చొని ఉన్నాడు. ఇంతలో ఏడుగురు వ్యక్తులు బైకులపై అక్కడకు వచ్చి ఆయనను చుట్టుముట్టారు.
 
ఒక వ్యక్తి రెండు నాటు బాంబులు విసిరాడు. దీంతో సెంథిల్‌ కుమార్‌ కుప్పకూలిపోయాడు. ఆ దుండగులు ఆయన వద్దకు వచ్చి కర్రలతో దాడి చేశారు. కత్తులతో నరికి చంపారు. అనంతరం బైకులపై అక్కడి నుంచి పారిపోయారు.  మరోవైపు సెంథిల్‌ కుమార్‌ హత్య విషయం తెలిసిన వెంటనే హోంమంత్రి ఏ నమశ్శివాయం, బంధువులు, సుమారు 700 మంది బీజేపీ కార్యకర్తలు ఆ ప్రాంతానికి వచ్చారు. చనిపోయిన సెంథిల్‌ను చూసి హోంమంత్రి నమశ్శివాయం, బంధువులు బోరున ఏడ్చారు.
 
పోలీసులు కూడా వెంటనే అక్కడకు చేరుకున్నారు. సెంథిల్‌ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హత్య జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను సేకరించారు. నిందితులను గుర్తించి అరెస్ట్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.