మోదీ – కోమటిరెడ్డి భేటీపై రాజకీయ కలకలం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురువారం జరిపిన భేటీ తెలంగాణాలో రాజకీయంగా కలకలం రేపుతోంది. గతంలో కూడా ఆయన పలుసార్లు ఆయన ప్రధానిని కలిసి, తన నియోజకవర్గం పనులకు సంబంధించి వినతిపత్రాలు ఇచ్చారు. అయితే, ఈ పర్యాయం కొన్ని వినతిపత్రాలు ఇవ్వడంతో పాటుగా భేటీ అనంతరం చేసిన రాజకీయ వ్యాఖ్యలు ఆయన బీజేపీలో చేరడానికి సిద్దపడుతున్నారనే సంకేతం ఇస్తున్నాయి.

పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వకపోవడంతో పాటు తెలంగాణాలో మొదటి నుంచి కాంగ్రెస్ నాయకత్వంతో ఇమడలేకపోతున్న ఆయన తరచూ వివాదాస్పద ప్రకటనలు ఇస్తూ పార్టీ నాయకత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నారు. గత ఏడాది ఆయన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్యెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆ తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో ఆయన ఓడినా తమ్ముడి గెలుపు కోసం కృషి చేసారని కాంగ్రెస్ లో ఆయనపై ఆరోపణలున్నాయి.

పైగా పార్టీ అధినేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా తెలంగాణాలో పర్యటించిన సమయంలో ఆయన ముఖం చాటేశారు. ఆయనకు పార్టీ నాయకత్వం షోకాజ్ నోటీసు కూడా జారీచేసింది. ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకత్వంపై వత్తిడులు వస్తున్నాయి. ఈ సంవత్సరం చివరిలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.

ఇటువంటి సమయంలో ఆయన ప్రధాని మోదీని కలవడమే కాకుండా ప్రధాని మోదీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం దేశంలో అన్ని రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని ఆ తర్వాత ఆయన ప్రశంసలు కురిపించడం ప్రాధాన్యత సంతరింప చేసుకుంది. పైగా, కొన్ని అంశాలు మీడియాతో చెప్పలేనివి ఉంటాయని, కొన్ని మీడియాతో చెప్పకూడదని అయన పేర్కొనడం గమనార్హం.

తన నియోజకవర్గ అభివృద్ధి పనులకు సంబంధించి పలు వినతి పత్రాలను ప్రధానికి అందజేయడంతో పాటు వాటిలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రస్తావిస్తూ కొనియాడారు. జాతీయ రహదారులు, రైల్వే లైన్లు, విమానాశ్రయాలు, టెక్స్‌టైల్ పార్కులు, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్, మెట్రో రైల్ కనెక్టివిటీ సహా మౌలిక సదుపాయాల అభివృద్ధికి మోదీ సర్కారు కృషి చేస్తోందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా హైదరాబాద్ మెట్రో రైలును ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు విస్తరించాలని కోరారు.కొంతకాలంగా కాంగ్రెస్ కార్యక్రమాల పట్ల అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్న వెంకటరెడ్డి, ఇప్పటికే బీజేపీలో కొనసాగుతున్న తమ్ముడు రాజగోపాల్ రెడ్డితో వచ్చి చేరుతారనే ఊహాగానాలు ఈ భేటీతో మరింత ఊపందుకుంటున్నాయి.