టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజిపై 48 గంటల్లో నివేదిక కోరిన గవర్నర్

టీఎస్‌పీఎస్సీ  పేపర్ లీకేజీ వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ అధికారులను ఆదేశించారు. కేసుపై 48 గంటల్లోగా తాజా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి,   టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్ రెడ్డి, డిజిపి అంజనీకుమార్‌లకు గవర్నర్ తమిళిసై లేఖలు రాశారు.

లీకేజీ అంశంలో సిట్ దర్యాప్తు ఎంతవరకు వచ్చిందన్న నివేదిక ఇవ్వాలని ఆమె ఆదేశించారు. పరీక్షలు రాసిన టీఎస్పీఎస్సీ సిబ్బంది వివరాలు, పరీక్ష రాసిన రెగ్యూలర్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది వివరాలు ఇవ్వాలని లేఖలో గవర్నర్ పేర్కొన్నారు. ఉద్యోగుల మార్కులతో పాటు అన్ని వివరాలు నివేదికలో పేర్కొనాలని సూచించారు.

ఈ విషయమై ఇటీవల తనను కలిసిన కాంగ్రెస్ నేతలతో గవర్నర్ తమిళిసై  ఈ వ్యవహారంలో అన్ని విషయాలను పరిశీలిస్తున్నట్టు తెలిపారు. రాజ్యాంగ బాధ్యతలకు లోబడే పని చేస్తానని చెప్పారు. కాంగ్రెస్ నేతలు ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన గవర్నర్  న్యాయ సలహా తీసుకుంటానని హామీ ఇచ్చారు.  ఉద్యోగార్థులకు న్యాయం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని గవర్నర్ అభిప్రాయపడ్డారు.

కాగా, తాజాగా ఈ  కేసులో అరెస్ట్ అయిన రమేష్, సురేష్, షమీమ్  ఇళ్లల్లో సిట్  అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బుధవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఎల్బీనగర్ లో నివాసం ఉంటున్న  షమీమ్  ను సిట్ అధికారులు ఇంటి నుంచే అరెస్ట్ చేశారు.

టీఎస్‌పీఎస్సీ పేపర్‌  లీకేజీ కేసులో  ఆరెస్టైన రమేష్,  షమీమ్, సురేష్ లు  సైతం గ్రూప్ 1 ఎగ్జామ్ రాసి టీఎస్‌పీఎస్సీ పేపర్‌  లీకేజీ కేసులో  ఆరెస్టైన రమేష్,  షమీమ్, సురేష్ లు  సైతం గ్రూప్ 1 ఎగ్జామ్ రాసి 100కి పైగా మార్కులు పొందినట్లు విచారణలో గుర్తించారు సిట్ అధికారులు.  పేపర్ లీకేజ్ ద్వారానే ఈ ముగ్గురు ఎగ్జామ్ రాశారని పోలీసులు చెబుతున్నారు.

టీఎస్‌పీఎస్సీ లో పనిచేసే 26 మంది గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాయగా వారిలో 8 మంది క్వాలిఫై అయ్యారని గుర్తించారు. ఒక్క రోజు కూడా ఉద్యోగానికి సెలవు పెట్టకుండా, ఎక్కడా శిక్షణ తీసుకోకుండా, సరిగ్గా చదవకుండానే ఈ ఫలితాలను వారు సాధించారు.  వీరిలో 17 మంది రెగ్యులర్‌ ఉద్యోగులు కాగా, 9 మంది అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేస్తున్నట్లు తెలిసింది. వీరిలో పని చేస్తున్న 30 మందికి ఇప్పటికే సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు.

తాజా సమాచారం ప్రకారం టీఎస్‌పీఎస్సీ ఉద్యోగి భర్తకు 127 మార్కులు, మరో ఉద్యోగికి 122 మార్కులు వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే డిస్‌క్వాలిఫై అయిన ప్రవీణ్‌కు 103 మార్కులు వచ్చాయి. ఈ స్థాయి ఫలితాలు రేయింబవళ్లు కష్టపడి చదివిన వారికి కూడా సాధ్యం కాకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

అనుమానితులందరినీ విచారించి వారి పాత్రపైనా ఆరా తీయనున్నారు. టీఎస్‌పీఎస్సీ  లీకేజీ కేసులో 12 మంది నిందితులకు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది.  అనంతరం వారిని చంచల్ గూడ జైలుకు తరలించారు. ఇప్పటికే లీకేజీ కేసులో ఆరెస్ట్ అయిన 9 మందిని పోలీసులు కస్డిడికి తీసుకుని విచారించారు.