రేవంత్, సంజయ్‌లకు కెటిఆర్ లీగల్ నోటీసులు

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవహారంపై  తనను లక్ష్యంగా చేసుకొని, తనను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలంటూ తరచూ ఆరోపణలు చేస్తున్న టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌లకు మంత్రి కెటిఆర్ లీగల్ నోటీసులు పంపారు. టిఎస్‌పిఎస్‌సి వ్యవహారంలో కేవలం రాజకీయ దురుద్దేశంతోనే తన పేరును లాగుతూ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే కుట్ర చేస్తున్నందుకు వీరిద్దరికి లీగల్ నోటీసులు పంపుతున్నట్లు చెప్పారు.

రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు స్వయంప్రతిపత్తి ఉంటుందన్న విషయం కూడా అవగాహన లేకుండా ఈ అంశంలోకి ప్రభుత్వాన్ని, తనను లాగడం వారి అజ్ఞానానికి నిదర్శనమని మండిపడ్డారు. ఒక దురదృష్ట సంఘటనను బూచిగా చూపి  మొత్తం నియామకాల ప్రక్రియను ఆపేయాలన్నది కాంగ్రెస్, బీజేపీల కుట్ర అని కేటీఆర్ ఆరోపించారు. మతిలేని రాజకీయ ఉచ్చులో పడి  యవత చిక్కుకొవద్దని హెచ్చరించారు. ఉద్యోగాల ప్రిపరేషన్ ను కొనసాగించాలని యవతకు మంత్రి పిలుపునిచ్చారు.

తనకు కేటీఆర్ లీగల్‌ నోటీసులు ఇచ్చారనే వార్తలపై బండి సంజయ్ చట్ట, న్యాయబద్ధంగా వాటికి తగిన సమాధానమిస్తామని తెలిపారు. రాజకీయంగా, ప్రజా క్షేత్రంలో పోరాడతామని స్పష్టం చేశారు. అయితే, తాను చేసిన ఆరోపణలపై సిట్ తనకు ఇచ్చిన నోటీసుల మేరకు శుక్రవారం విచారణకు హాజరుకావడం లేదని తేల్చి చెప్పారు.
 
ఆ నోటీసులకు స్పందించరాదని, విచారణకు హాజరు కారాదని ఆయన నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక, సిట్‌పై తనకు నమ్మకం లేదని, హైకోర్టు సిటింగ్‌ జడ్జి నేతృత్వంలో విచారణ జరిపిస్తేనే ఆధారాలు అందజేస్తానని సంజయ్‌ ఇప్పటికే స్పష్టం చేశారు. పైగా, సంజయ్‌ ప్రస్తుతం పార్లమెంటు సమావేశాల్లో ఉన్నారని, విప్‌ కూడా జారీ అయిందని పార్టీ నాయకులు తెలిపారు.
 
ఇలా ఉండగా, రేవంత్ రెడ్డి గురువారం సిట్ విచారణకు హాజరయ్యారు. అన్ని ఆధారాలు అందించానని చెప్పారు. కానీ ఆయన ఎటువంటి ఆధారాలు ఇవ్వలేదని,  తప్పుడు ఆరోపణలతో దర్యాప్తును తప్పుదోవ పట్టించినందుకు రేవంత్‌పై కేసు నమోదు చేసే యోచనతో   న్యాయ సలహాలు తీసుకుంటున్నట్లు సిట్ అధికారులు తెలిపారు.