నకిలీ వార్తలు సమాజానికి ప్రమాదకరం

నకిలీ వార్తలు సమాజానికి చాలా ప్రమాకరమైనవని, వీటి పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ హెచ్చరించారు. ఈ ఫేక్‌ న్యూస్‌ సమాజంలో మతాల మధ్య ఉద్రిక్తతలు, విద్వేషాలు సృష్టిస్తాయని, తద్వారా ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెడుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
 
ఢిల్లీలో బుధవారం జరిగిన 16వ రామ్‌నాథ్‌ గోయెంకా అవార్డుల ప్రదానోత్సవానికి సీజేఐ ముఖ్య అతిథిగా హాజరవుతూ  బాధ్యతాయుతమైన జర్నలిజం దేశ ప్రజాస్వామ్యాన్ని మెరుగైన దిశగా నడిపించే ఇంజిన్‌ అని అభిప్రాయపడ్డారు. నేటి డిజిటల్‌ యుగంలో జర్నలిస్టులు తమ రిపోర్టింగ్‌లో కచ్చితంగా, నిష్పాక్షికత, బాధ్యతాయుతంగా, భయం లేకుండా ఉండటం ముఖ్యమని తెలిపారు.

ప్రజాస్వామ్య దేశంగా వర్ధిల్లాలి అంటే మీడియా స్వేచ్ఛ ముఖ్యమని సీజేఐ చంద్రచూడ్‌ స్పష్టం చేశారు. కత్తి కంటే కలం గొప్పదనే విషయాన్ని యావత్తు లోకం విశ్వసిస్తుందని చెప్పారు. పలు సందర్భాల్లో సామాజిక, రాజకీయ మార్పుల్లో కీలక పాత్ర పోషించిన చరిత్ర వార్తాపత్రికలకు ఉన్నదని పేర్కొన్నారు.

ఒక్క నకిలీ వార్త తీవ్రమైన విధ్వంసానికి దారితీసే ప్రమాదం ఉన్నదని పేర్కొంటూ ఈ నేపథ్యంలో వాస్తవాలను పరిశీలించే సమగ్రమైన వ్యవస్థ ఉండాలని సూచించారు. ఇదే సమయంలో ‘మీడియా ట్రయల్స్‌’పై కూడా ప్రస్తావిస్తూ ఇంకా కోర్టులు కూడా కేసు విచారణ పూర్తి చేయకుండానే  మీడియా ఒక నిందితుడిని ప్రజల దృష్టిలో దోషిగా చూపిన సందర్భాలు ఉన్నాయని విచారం వ్యక్తం చేశారు.

అమాయకుల హక్కులను ఉల్లంఘించకుండా ప్రజలకు సమాచారం అందించడం మీడియా బాధ్యతని చంద్రచూడ్ చెప్పారు. ఇందిరా గాంధీ హయాంలో విధించిన అత్యవసర పరిస్థితి అంశాన్నిప్రస్తావిస్తూ ఆ సమయంలో ఇంగ్లిష్‌ పత్రిక ‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ తన ఎడిట్‌ పేజీలను ఖాళీగా ప్రచురించిందని గుర్తు చేశారు.

 నిశ్శబ్దం ఎంత శక్తివంతమైందో చూపిందనే దానికి అది నిదర్శమని ఆయన కొనియాడారు. ‘అది భయంకరమైన సమయం. భయం లేని సమయం కూడా.. ఆ సమయం నిర్భయమైన జర్నలిజానికి దారితీసింది’ అని ఆనాటి పరిస్థితుల గురించి వివరించారు. నిజం, అబద్ధం మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించాల్సిన అవసరం ఉన్నదని చంద్రచూడ్‌ స్పష్టం చేశారు.