రాహుల్ కు రెండేళ్ల జైలు శిక్ష.. అనర్హత వేటు తప్పదా!

ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీని సూరత్‌ కోర్టు దోషిగా తేల్చింది. పరువు నష్టం కేసులో ఐపీసీ సెక్షన్ 504 కింద రాహుల్ గాంధీని దోషిగా పేర్కొని రెండేళ్ల జైలుశిక్షను విధించింది.  మోదీ ఇంటి పేరును ఉద్దేశించి కర్ణాటకలో 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్‌ తీవ్ర విమర్శలు చేశారు. దేశం నుంచి పారిపోయిన నీరవ్​ మోదీ, లలిత్​ మోదీలతో పాటు ప్రధాని నరేంద్ర మోదీకి కూడా ఈ ఇంటి పేరు ఉండటంతో.. రాహుల్​ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది.

దీనిపై గుజరాత్‌ మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్​ మోదీ కోర్టుకు వెళ్లారు. రాహుల్‌పై పరువునష్టం కేసు వేశారు. మొత్తం మోదీ సంఘాన్నే కించపరించే విధంగా రాహుల్​ గాంధీ వ్యాఖ్యానించారు వ్యాజ్యంలో పేర్కొన్నారు.విచారణ జరిపిన గుజరాత్‌లోని సూరత్‌ కోర్టు రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. జైలు శిక్ష తీర్పు సమయంలో రాహుల్ గాంధీ కోర్టులోనే ఉన్నారు. తీర్పుతో షాక్ అయ్యారు. 

తీర్పును సవాలు చేసేందుకు రాహుల్​ గాంధీకి అవకాశాన్ని ఇచ్చింది సూరత్​లోని జిల్లా కోర్టు. అంతేకాకుండా, రాహుల్​ గాంధీకి 30 రోజుల బెయిల్​ని మంజూరు చేసింది. అప్పటి వరకు ఈ శిక్షను కోర్టు తాత్కాలికంగా నిలిపివేయనుంది. రాహుల్​ గాంధీకి 30 రోజుల పాటు బెయిల్​ లభించినా సూరత్​ కోర్టు తీర్పుతో ఆయనపై అనర్హత వేటు పడే అవకాశం ఉందని న్యాయశాఖ నిపుణులు చెబుతున్నారు.

1951 రిప్రజెంటేటివ్​ ఆఫ్​ ది పీపుల్​ యాక్ట్​ సెక్షన్​ 8(3) ప్రకారం.. పార్లమెంట్​ సభ్యుడిని ఏదైనా కోర్టు దోషిగా తేలుస్తూ.. కనీసం 2ఏళ్ల జైలు శిక్ష విధించినట్టు అయితే, సంబంధిత ఎంపీపై అనర్హత వేటు పడాలి! ఇక రాహుల్​ గాంధీ వేసిన సెక్షన్​ 499 (క్రిమినల్​ డిఫమేషన్​ కేసు) చాలా అరుదైనదని న్యాయశాఖ నిపుణులు చెబుతున్నారు.

ఇక సూరత్​ కోర్టు తీర్పుతో రాహుల్​ గాంధీపై అనర్హత వేటు వేసి, వయనాడ్​ సీటును ఖాళీగా ఉందని ప్రకటించే అధికారం లోక్​సభ సెక్రటేరియట్​కు ఉంది. సూరత్​ కోర్టు తీర్పుపై ఎగువ కోర్టులేవీ స్టే విధించకపోతే ఇదే జరుగుతుంది. ఈ తీర్పును ఎగువ కోర్టులు కొట్టివేయకపోతే మరో 8 ఏళ్ల పాటు రాహుల్​ గాంధీ ఎలాంటి ఎన్నికల్లోనూ పోటీచేయలేరు కూడా!

కాగా, 2019లో కర్నాటకలోని కోలార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా దేశంలోని దొంగలందరి ఇంటి పేర్లు మోదీ అనే ఎందుకు ఉంటాయంటూ వాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ కోర్టులో కేసు వేశారు ఓ వ్యక్తి. రెండేళ్ల విచారణ తర్వాత వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలోనే 2023, మార్చి 23వ తేదీ గురువారం సూరత్ కోర్టుకు హాజరయ్యారు రాహుల్ గాంధీ. ప్రధాని మోదీ ప్రతిష్టకు భంగం కలిగించారని.. సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నాయని నిర్థారించిన కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది.