మూడో వన్డేలో భారత్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం

మూడో వన్డేలో 21 పరుగుల తేడాతో భారత్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 270 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత బ్యాట్స్‌మెన్స్ విజయాన్ని అందుకోలేకపోయారు. 49.1 ఓవర్లలో భారత జట్టు 248 పరుగులు చేసి ఆలౌట్ అయింది. 3 వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. ఈ విజయంతో వన్డే ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా జట్టు నెం.1గా నిలిచింది. బ్యాటింగ్‌ బరిలోకి దిగిన భారత బ్యాట్స్‌మెన్స్ మొదట పరుగుల వరద పారించి టీం ఇండియా గెలుపుపై ఆశలు రేపారు.

అయితే కొద్దిసేపటి తర్వాత భారత క్రికెటర్లు పరుగులు చేయకుండా ఆస్ట్రేలియా బౌలర్లు కట్టడి చేశారు. మైదానంలో నలువైపులా ఆస్ట్రేలియా జట్టు అద్భతంగా ఫీల్డింగ్ చేసి భారత్ పరుగులు చేయకుండా చేసింది. ఆస్ట్రేలియా జట్టు 49 ఓవర్లలో 269 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. చెన్నై నగరంలో టీం ఇండియా- ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే మ్యాచ్ జరిగింది.

ఆసీస్ బ్యాటర్లలో ఎవరూ భారీ ఇన్నింగ్స్ ఆడకపోయినా ఓపెనర్లు ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ తొలి వికెట్‌కు 68 పరుగుల భాగస్వామ్యం, మిడిలార్డర్ బ్యాటర్లు గౌరవప్రదర్శమైన స్కోర్ల అండతో పర్యాటక జట్టు 49 ఓవర్లలో 269 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లలో అత్యధికంగా ఓపెనర్ మిచెల్ మార్ష్ 47 పరుగులు, మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ 33 పరుగులు చేశారు.

తర్వాత వచ్చినవారెరూ పెద్ద స్కోర్లు చేయలేకపోయినా.. గౌరవప్రదమైన స్కోర్లు చేసి వెనుదిరిగారు. స్టీవెన్ స్మిత్ (0), డేవిడ్ వార్నర్ (23), లబుషేన్ (28), అలెక్స్ క్యారీ (38), మార్కస్ స్టోయినీస్ (25), సీన్ అబ్బాట్ (26), ఆగర్ (17), మిచెల్ స్టార్క్ (10), ఆడమ్ జంపా (10) చొప్పున పరుగులు చేశారు.

ఇక భారత బౌలర్లు వికెట్ల వేట ఆలస్యంగానే మొదలైనప్పటికీ ఆ తర్వాత కీలక సమయాల్లో వికెట్లు తీశారు. కానీ పరుగులను మాత్రం నియంత్రించలేకపోయారు. దీంతో ఆసీస్ 269 పరుగులు చేయగలిగింది. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ చెరో 3 వికెట్లు చొప్పున తీయగా.. ఇక మహ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్ చెరో 2 వికెట్లు తీశారు.