ఆధార్ తో ఓటర్ ఐడీ లింక్ గడువు మరో ఏడాది పెంపు

దేశంలో ఎన్నికల అక్రమాల నియంత్రణకు గుర్తింపు కార్డుగా ఉన్న ఆధార్ కార్డు ఐడీని ఓటర్ కార్డుతో అనుసంధానం చేసేందుకు కేంద్రం విధించిన గడువు ఈ నెలాఖరుతో పూర్తవుతోంది. దీంతో ఇవాళ మరోసారి ఈ గడువును పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.  దేశవ్యాప్తంగా ఆధార్-ఓటరు ఐడీ అనుసంధానంలో ఎదురవుతున్న ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రం గడువును మరో ఏడాది కాలం పాటు  పెంపుతూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
దీని ప్రకారం ఈ గడువు 2023 ఏప్రిల్ 1 నుంచి వచ్చే ఏడాది మార్చి 31వరకూ పెరిగింది.  దీంతో మరో ఏడాది పాటు ఆధార్-ఓటరు కార్డు లింక్ చేసుకునేందుకు జనానికి అవకాశం దొరికింది. దేశవ్యాప్తంగా ఆధార్ కార్డుల ఐడీతో ఓటరు కార్డు ఐడీతో అనుసంధానించేందుకు వీలుగా కేంద్రం ప్రజల నుంచి వివరాలు సేకరిస్తోంది. అయితే అనుసంధానం ప్రక్రియ మాత్రం పూర్తి కాలేదు.
 
గత ఏడాది డిసెంబర్ వరకూ కేవలం 54 కోట్ల మంది వివరాలు మాత్రమే సేకరించారు. వీటి అనుసంధానం పూర్తి కాకపోవడం, కొత్తగా సేకరించే విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో మరోసారి లింకింగ్ గడువు పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మరోవైపు పాన్ కార్డును సైతం ఆధార్ తో లింక్ చేసేందుకు విధించిన గడువు కూడా ఈనెలాఖరుతో ముగియనున్న నేపథ్యంలో దాన్ని కూడా పెంచాలని విపక్షాలు కేంద్రాన్ని కోరుతున్నాయి.