రూ 4,411 కోట్లతో టీటీడీ బడ్జెట్

2023- 24 ఆర్థిక సంవత్సరానికి రూ 4,411.68 కోట్ల బడ్జెట్ ను టీటీడీ ధర్మకర్తల మండలి ఆమోదించిందని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేసిందని ఆయన వివరించారు.  ఫిబ్రవరి నెల 15వ తేదీ టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో 2023-24 బడ్జెట్ ఆమోదంతో పాటు కొన్ని పరిపాలనా పరమైన నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందువల్ల ఆ వివరాలను ఇప్పటి వరకు వెల్లడించలేదు.
 
హుండీల ద్వారా రూ 1591 కోట్ల ఆదాయం, వడ్డీల ద్వారా రూ.990 కోట్ల ఆదాయం, ప్రసాదాల ద్వారా రూ.500 కోట్ల ఆదాయం, దర్శన టికెట్ల ద్వారా రూ.330 కోట్ల ఆదాయం అంచనా వేశారు. కరోనాకు ముందు ఏడాదికి రూ 1200 కోట్లు కానుకలు లభించేవి. కరోనా తరువాత హుండీ ఆదాయం రూ 1500 కోట్ల దాకా పెరిగింది. బ్యాంకుల్లో ఉన్న టీటీడీ డిపాజిట్ల మీద కూడా వడ్డీ రేట్లు పెరిగాయి.
 
భక్తుల సౌకర్యార్థం రూ.5.25 కోట్లతో అదనపు లడ్డూ కౌంటర్లు తెరిచారు. తమిళనాడులో ఉల్లందూరుపేటలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి అదనంగా రూ.4 కోట్లు ఇచ్చామని సుబ్బారెడ్డి తెలిపారు. ఎస్‌జిఎస్ ఆర్ట్ కళాశాలలో అదనపు భవన నిర్మాణాలకు రూ.4.71 కోట్లు విడుదల చేశారు. తిరుపతిలో నిర్మిస్తున్న శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ ను  ఏప్రిల్ చివరి నాటికి ప్రారంభిస్తామని చెప్పారు.
 
ఆన్‌లైన్ సేవలను ఇకపై నిరంతరంగా కొనసాగిస్తామని, డిసెంబర్ నాటికి చిన్న పిల్లల ఆస్పత్రిని ప్రారంభిస్తామని వివరించారు. ఏప్రిల్ 5న ఒంటిమిట్టలో రాములవారి కల్యాణం జరుగుతుందని, ఎపి ప్రభుత్వం తరపున సిఎం జగన్ మోహన్ రెడ్డి పట్టు వస్త్రాల సమర్పిస్తారని తెలిపారు.
 
విఐపి బ్రేక్ దర్శనం సమయం మార్చినందువల్ల సామాన్య భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఈ విధానాన్ని కొనసాగిస్తాం. కోవిడ్ తరువాత హుండీ ఆదాయం గణనీయంగా పెరిగింది. కోవిడ్ కు ముందు ఏడాదికి రూ 1200 కోట్లు కానుకలు లభించేవి. కోవిడ్ తరువాత హుండీ ఆదాయం రూ 1500 కోట్ల దాకా పెరిగింది. బ్యాంకుల్లో ఉన్న టీటీడీ డిపాజిట్ల మీద కూడా వడ్డీ రేట్లు పెరిగాయి.