గాంధీ కన్నా ముందే వయోజన విద్య చేపట్టిన దొమ్మేటి వెంకటరెడ్డి

టపా వీర గోవింద రావు
* 170వ జయంతి నివాళి
 
కోస్తా జిల్లాల్లో ఆనాడు శెట్టి బలిజలు 18 వ శతాబ్దంలో ఎన్నో ఇబ్బందులకు గురయ్యేవారు. గ్రామాలలో వ్యవసాయ కూలీలుగా, కల్లుగీత వృత్తి దారులుగా తమ జీవనం సాగించేవారు. నాడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో వీరి సంఖ్య 15 శాతం ఉండేది. అప్పట్లో నిరక్షరాస్యత ఎక్కువగా ఉండడంతో వీరికి నాటి బ్రిటిష్ ప్రభుత్వంలో ఉద్యోగాలు దక్కేవి కావు.
 
1853 మార్చి 23 న వ్యవసాయ కుటుంబంలో జన్మించిన దొమ్మేటి వెంకటరెడ్డి అప్పుడే అమలాపురంలో నాటి బ్రిటిష్ ప్రభుత్వం స్థాపించిన ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసించారు. 18వ శతాబ్దం సగకాలం వరకు మన భారతదేశంలో నిండుగా పేదరికం, ఆకలి భాదలతో ప్రజలు నిత్యం తల్లడిల్లేవారు. ముఖ్యముగా రోడ్లు లేవు, రవాణా సదుపాయములు లేవు. వైద్య సదుపాయం అసలే లేవు. నీటి వనరులు లేవు. వ్యవసాయం పూర్తిగా వర్షాదారంతో ఉన్న రోజులవి.
 
పంటదైవాధీనంగా ఉంటూ, వ్యవసాయ సాగుబడులులేక, గోదావరి తల్లికి ఆనకట్టలు లేక, గంగ సముద్రపు పాలై, తుఫానులతో భీతుల్లుతూ, బాలింతల చావులు, శిశు మరణాలలో, రోగమునకు వాత, లంకణములు ఉండుట తప్ప వైద్యంలేని రోజులవి. ఆనాటి ప్రజాపాలకులైన రారాజులు, సామంత రాజులు, నవాబులు వంటివారు ప్రజలపై సుంకములు మోపి, ప్రజలను కొల్లగొట్టి కోటలు నిర్మించుట, సైన్యములు పెంచి పోషించుచూ, నిత్యం యుద్ధములతోనే కాలము వెల్లబుచ్చేవారు. ప్రజల యోగక్షేమములతో వారికి పనిలేదు.
 
కులాధిక్యత, అంటరానితనము అధికంగా ఉండేది. ఆనాటి బ్రాహ్మణులకు మాత్రమే విద్య పరిమితమై వారు చెప్పి మాట వేదములుగా ఉండేవి. 
హరిజనులను అంటరాని వారనీ, వారు దేవాలయాలలో ప్రవేశించరాదనీ శాసించే వారు. అగ్రజాతుల వారి వీధులు గుండా నడవరాదు. శూద్రులు చదవరాదు.  చదివితే కళ్ళుపోతాయి.సరస్వతీ తల్లికి అపచారం అని బూటకపు సిద్ధాంతములను ప్రభోదించేవారు.
 
నాడు శెట్టి బలిజలు సమాజంలో శూద్రులుగా ఉండేవారు.శూద్రులను అతి శూద్రులను విద్యావిహీనులను చేసేవారు. వారిని వ్యవసాయ కూలీలుగా పశుప్రాయులుగా చేస్తున్న రోజులలో బ్రిటీష్ పాలకులు భారతదేశం ప్రవేశించి రహదారులు, రైలు మార్గాలు, నదులపై ఆనకట్టలు, ఓడరేవులు నిర్మించి భారదేశంలో కొత్త శకానికి బ్రిటీష్ పాలకు నాంది పలికారు.
 
ఇకపోతే భారతదేశంతో పాటు బర్మాదేశం కూడా బ్రిటీష్ పాలనలో ఆనాడు ఉండేది. ఈ రెండు దేశముల మధ్య రవాణా, రాకపోకలపై ప్రత్యేక సదుపాయాలతో ఎటుంవంటి అభ్యంతరంలేని రోజులవి. ఇట్టి సమయంలో ఉమ్మడి మద్రాసు నుండి, బీదరికమున మ్రగ్గుచున్న అధిక శాతం శెట్టి బలిజ యువకులు జీవనోపాధి కొరకై, వ్యాపారం కొరకై బర్మా దేశం వెళ్ళేవారు.
 
అక్కడనుండి ఎంతో కొంత ధనం సముపార్జించుకొని భారత దేశం వచ్చి అమలాపురం వెళుతుండేవారు.1900 ప్రాంతంలో సంఘ సంస్కర్త  దొమ్మేటి వెంకటరెడ్డి ధనార్జన కొరకు బ్రిటీష్ పాలనలో ఉన్న బర్మా దేశం వెళ్లారు.  బర్మాలో ఓడలపై రవాణా కాంట్రాక్టులు నిర్వహించారు. అధిక లాభాలు గడించారు.  అద్దెకు తీసుకున్న స్టీమర్లకు యజమానులై స్వదేశంలో వ్యవసాయ, భూములు, కొబ్బరి తోటలు కూడా అధికంగా సంపాదించిన దొమ్మేటి వెంకటరెడ్డి పెద్ద భూస్వామి కావడం జరిగింది. అప్పటి నుంచి ఆయన బోడస్కుర్రు జమిందార్ గా ప్రసిద్ధి.
 
బర్మాదేశం చేరిన ప్రవాస భారతీయులలో చదువులేనివారు కూలీలుగా, చేవాలు చేయకలిగిన వారు మేట్రన్లుగా పనిచేసెడివారు. 1900లో ఆయన బర్మా వ్యాపారం నిమిత్తం వెళ్ళారు. బర్మాలో తమ కులస్తులు కోనసీమలో మాదిరిగా నే అనేక కష్టనష్టాలకు గురవుతున్నారని భావించి తల్లడిల్లి పోయారు.
ఇట్టి తారతమ్యాలు గ్రహించి విద్య విశిష్టత తెలుసుకున్నదొమ్మేటి వెంకటరెడ్డి బర్మాలో తమ జాతీయులందర్ని సంస్కరించి, విద్యావంతులను చేయాలనే సత్సంకల్పసిద్ధికి దీక్ష బూనారు.
ఈ ప్రయత్నంలో మొదటిసారిగా 1905 లోనే బర్మాలోని ప్రవాస శెట్టిబలిజ సోదరులనందరిని సమీకరించి “శెట్టిబలిజ సంక్షేమసంఘం”ను స్థాపించారు. ఈ సంఘం ద్వారా బర్మాదేశంలో ప్రాధమిక పాఠశాలలు, గ్రంథాలయాలు, రాత్రి పాఠశాలలు, నెలకొల్పి వయోజన విద్యాబోధనకు ఆనాడే అనగా జాతిపిత మహాత్మాగాంధీ కంటే ముందుగానే అంకురార్పణ చేశారు. ఇది విద్య ప్రాధాన్యత పట్ల ఆయనకు ఉన్న దూరదృష్టి.
 
ఆ నాడు భారత స్వాతంత్ర్య సంగ్రామంలో జాతీయోద్దరణకు తన వంతు ప్రయత్నంగా శెట్టి బలిజలతో ఒక సైన్యాన్ని తయారు చేశారు. అదే ఉద్యమాన్ని స్వదేశమందు ప్రవేశపెట్టారు. 1920 సెప్టెంబరు 25న తేదీన తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం తాలూకా, బోడసకుర్రు గ్రామంలో  దొమ్మేటి వెంకటరెడ్డి ని నాటి బ్రిటిష్ ప్రభుత్వం అరెస్టు చేసింది.
 
అప్పటి నుంచి బోడస్కుర్రులో శెట్టి బలిజ లలో చైతన్యం తీసుకు వచ్చి ఎన్నో పుస్తకాలు రాశారు. ఈ విధంగా తాను జీవించినంత కాలం సమాజానికి సేవలు అందించి తన 75వ ఏట అనగా 1928 మార్చి 26న శివసాయుజ్యం పొందారు.