జ‌న‌సేన – బిజెపి మ‌ధ్య పొత్తు ఉన్నా లేన్నట్లే

ఎపిలో జ‌న‌సేన – బిజెపి మ‌ధ్య పొత్తు ఉన్నా లేన‌ట్లుగానే కొన‌సాగుతున్న‌ద‌ని బిజెపి మాజీ ఎమ్మెల్సీ, రాష్త్ర ప్రధాన కార్యదర్శి పివిఎన్ మాధ‌వ్ సంచలన వాఖ్యలు చేశారు. . బీజేపీ, జనసేన పొత్తు ఉన్నా క్షేత్రస్థాయిలో పనిచేయడం లేదని స్పష్టం చేశారు.  ఇరుపార్టీలు కలిసి పనిచేసే దిశగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్, నాదేండ్ల మనోహర్‌ ఆలోచించాలని మాధవ్‌ సూచించారు. లేకపోతే పేరుకే రెండు పార్టీల పొత్తు అని జనం అనుకుంటారని తెలిపారు.
 ఇటీవ‌ల తాను ఎమ్మెల్సీగా బ‌రిలోకి దిగిన సంద‌ర్బంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ను స్వ‌యంగా క‌లిసి మ‌ద్ద‌తు కోరినా ఆయ‌న నుంచి స్పంద‌న క‌నిపించ‌లేద‌ని వాపోయారు. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థికి జనసేన మద్దతు ఉందని ప్రచారం జరిగిందని, దీన్ని ఖండించాలని తాము జనసేన నాయకత్వాన్ని కోరామని, కానీ వారు ఖండించలేదని మాధవ్ వెల్లడించారు.  జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ త‌మ‌తో కలిసి రావడం లేద‌ని పేర్కొంటూ జనసేన, బీజేపీ కలసికట్టుగా ప్రజల్లోకి వెళితేనే పొత్తు ఉందని నమ్ముతారని స్పష్టం చేశారు.
 
బీజేపీతో సన్నిహితంగా ఉన్నామన్న సంకేతాలను వైసీపీ ప్రజల్లోకి బలంగా పంపిందని, దాంతో ఏపీ బీజేపీ, వైసీపీ ఒకటేనని ప్రజలు నమ్మారని మాధవ్ వివరించారు. దీనివ‌ల్ల తాను ఓట‌మిపాల‌య్యాని పేర్కొన్నారు. ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటును ఆకర్షించడంలో టిడిపి విజ‌యం సాధించింద‌ని మాధ‌వ్ అభిప్రాయ‌ప‌డ్డారు.
‘ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ కు మంచి అవకాశం ఉంది. సభకు వచ్చిన జనాన్ని అందరూ చూశారు. బీజేపీ, జనసేన కలిసి పని చేస్ ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. రాష్ట్రంలో ప్రభంజనం సృష్టించొచ్చు. ప్రస్తుతం బీజేపీ, జనసేన పొత్తుతో ముందుకు వెళ్తున్నాయి. బీజేపీ చేపట్టే చాలా కార్యక్రమాలకు జనసేనను ఆహ్వానించాం. కానీ వారు రాలేదు. ఏదైనా అసంతృప్తి ఉంటే అంతర్గతంగా పరిష్కరించుకుంటాం. వైసిపి ప్రభుత్వ అవినీతిపై బీజేపీ ఎప్పుడూ పోరాటం చేస్తూనే ఉంది.’ అని మాధవ్ వివరించారు.
పొత్తుల విషయం తమ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని మాధవ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో పొత్తుల మీద అనేక రకాలుగా ప్రచారం జరుగుతుందని చెబుతూ తాము మాత్రం పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని స్పష్టం తెలిపారు.