సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంతో చైనా – రష్యా

చైనా, రష్యా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం, సమన్వయంతో సమిష్టిగా ముందుకు సాగాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. చైనా అధ్యక్షుడు సీ జిన్‌పింగ్‌ రష్యా ప్రధాని మిఖాయిల్‌ మిషుస్తిన్‌తో మంగళవారం భేటీ అయ్యారు. ఆ తరువాత ఇరు దేశాల ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాలు ఈ ఇరువురి నేతల సారథ్యంలో సమావేశమయ్యాయి.
 
మిషుస్తిన్‌తో జరిపిన భేటీలో జిన్‌పింగ్‌ మాట్లాడుతూ, వాణిజ్యం, పెట్టుబడులు, సప్లయి చైన్‌, మెగా ప్రాజెక్టులు, ఇంధనం, హై-టెక్‌ ఏరియాల్లో రష్యాతో సహకారాన్ని పెంపొందించుకునేందుకు చైనా సిద్ధంగా ఉందని తెలిపారు. చైనా, రష్యా రెండూ అతి పెద్ద ఇరుగుపొరుగు దేశాలని, ఇవి పరస్పరం గౌరవించుకుంటూ సమగ్ర వ్యూహాత్మక భాగస్వాములుగా సమన్వయంతో ముందుకు సాగుతాయని చెప్పారు.
 
ఇరు దేశాల సంబంధాలు ఆరోగ్యకరంగా, నిలకడగా అభివృద్ధి చెందుతున్నట్లు జిన్‌పింగ్‌ చెప్పారు. చైనా, రష్యా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం, సమన్వయంతో సమిష్టిగా ముందుకు సాగుతాయని పేర్కొన్నారు. ఇరు దేశాల ప్రధానులు ఎప్పటికప్పుడు చర్చించుకుంటూ, కమ్యూనికేషన్‌ చానెళ్లను సంస్థాగతం చేస్తూ ద్వైపాక్షిక సంబంధాలను మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్తాయని తెలిపానారు.
 
‘బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఫోరమ్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ కో-ఆపరేషన్‌’ మూడవ వార్షిక సమావేశాలకు రావాల్సిందిగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను తాను ఆహ్వానించానని జిన్‌పింగ్‌ తెలిపారు. ఈ ఫోరమ్‌ మొదటి రెండు వార్షికోత్సవాలకు పుతిన్‌ హాజరైన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. చైనా-రష్యా మధ్య వారధిగా బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ముఖ్యమైన పాత్ర పోషిస్తోందని ఆయన చెప్పారు.
 
రష్యా ప్రధానితో జిన్‌పింగ్‌ జరిపిన చర్చల్లో ఉక్రెయిన్‌తో సహా పలు కీలకమైన అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. అంతకుముందు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లదిమిర్‌ జెలెన్‌స్కీతో ఫోన్‌లో సంభాషించినట్లు ఉక్రెయిన్‌ ఉప ప్రధాని ఇరినా వీరేష్‌చుక్‌ తెలిపారు.
 
ఇటాలియన్‌ వార్తా పత్రిక ‘కొరీరే డెల్లా సెరా’ తో వీరేష్‌చుక్‌ మాట్లాడుతూ, ఈ ఇరువురి నేతల మధ్య సంభాషణలు ఒక ముఖ్యమైన పరిణామమని వ్యాఖ్యానించారు. రష్యా, ఉక్రెయిన్‌ మధ్య ఘర్షణ తరువాత సీ జిన్‌పింగ్‌ జెలెన్‌స్కీతో ఎన్నడూ మాట్లాడలేదని గత వారం వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పేర్కొంది.
 
జిన్‌పింగ్‌ రష్యా పర్యటన నుంచి తిరిగి వచ్చిన తరువాతే చైనా, ఉక్రెయిన్‌ నేతల మధ్య వర్చువల్‌ సమావేశం ఉండొచ్చని పేరు తెలపడానికి ఇష్టపడని ఓ ఉన్నతాధికారి తెలిపారు. చైనా నేత జిన్‌పింగ్‌ సోమవారం మాస్కోకు చేరుకున్న తరువాత రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో దాదాపు అయిదున్నర గంటల సేపు ముఖాముఖి చర్చలు జరిపారు.