ఏటీఎంలలో రూ. 2,000 నోట్లపై ప్రభుత్వ ప్రమేయం లేదు

దేశంలోని ఏటీఎం లలో ఇదివరకు మాదిరిగా రూ. 2,000 నోట్లు లభ్యం కాకపోవడంతో ప్రభుత్వ ప్రమేయం ఏమీ లేదని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ స్పష్టం చేశారు. ఏటీఎం లలో రూ. 2,000 నోట్లను ఉంచామని గాని, ఉంచవద్దని గాని ప్రభుత్వం బ్యాంకులకు ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదని ఆమె లోక్‌‍సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సోమవారంనాడు లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.

రిజర్వు బ్యాంక్‌ ఆఫ్ ఇండియా వార్షిక నివేదిక ప్రకారం 2017 మార్చి నాటికి చలామణీలో ఉన్న రూ.500, రూ.2000 వేల నోట్ల విలువ రూ.9.512 లక్షల కోట్లు కాగా,  2022 మార్చి నాటికి ఆ మొత్తం రూ.27.057 లక్షల కోట్లకు పెరిగిందని మంత్రి వెల్లడించారు.  ఏటీఎం కేంద్రాల్లో నోట్లను అందుబాటులో ఉంచడమనేది బ్యాంకుల స్వతంత్ర నిర్ణయమని ఆమె స్పష్టం చేశారు. ఏటీఎం కేంద్రాల్లో ఏ నోట్లను లోడ్ చేయాలనేది వెండర్ల సొంత నిర్ణయమని చెప్పారు. ఖాతాదారుల అవసరాలకు అనుగుణంగా, కాలానికి అనుగుణంగా నోట్లను జమచేస్తుంటారని తెలిపారు.

మరో ప్రశ్నకు సమాధానమిస్తూ, కేంద్ర ప్రభుత్వ అప్పులు 2023 మార్చి 31 నాటికి రూ.155.8 లక్షకు కోట్లకు చేరుకుంటుందనే అంచనా వేశామని ఆర్ధిక మంత్రి తెలిపారు. దేశ జీడీపీలో ఇది 77.3 శాతం ఉంటుందని అంచనా వేశామని చెప్పారు.  విదేశీ రుణాల విలువ కరెంట్ ఎక్స్చేంజి రేటుతో చూసుకున్నట్లయితే రూ.7.03 లక్షల కోట్లుగా ఉంటుందని ఆమె తెలిపారు. అది జీడీపీలో 2.6 శాతమని చెప్పారు. మొత్తం అప్పుల్లో విదేశాల నుంచి తీసుకుంది కేవలం 4.5 శాతమేనని, జీడీపీలో 3 శాతం లోపేనని ఆమె వెల్లడించారు. 

దేశంలో చెలామణిలో ఉన్న రూ.500, రూ.1000 నోట్లను అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ ప్రభుత్వం రద్దుచేసింది. రూ.500 నోటుతో పాటు కొత్తగా రూ.2వేల నోటు కూడా చెలామణిలోకి తీసుకువచ్చారు.  తాజాగా మంత్రి ఇచ్చిన సమాధానాన్ని బట్టి రూ.2వేల నోటును ఆర్బీఐ రద్దుచేయలేదనేది స్పష్టమైంది.