అంతర్జాతీయంగా భారీగా తగ్గుతున్న ముడి చమురు ధరలు

అమెరికా, స్విట్జ‌ర్లాండ్ బ్యాంకుల్లో సంక్షోభాలు, అమెరికా ఫెడ్ రిజ‌ర్వు వ‌డ్డీరేట్లు పెంపు.. ఫ‌లితంగా ఆర్థిక మాంద్యం ముదురుతుంద‌న్న అంచ‌నాల మ‌ధ్య గ్లోబ‌ల్ మార్కెట్‌లో క్రూడాయిల్ ధ‌ర‌లు భారీగా త‌గ్గాయి. ఆర్థిక మాంద్యం ప‌రిస్థితులు త‌లెత్తితే ముడి చ‌మురుకు డిమాండ్ త‌గ్గుతుంద‌న్న భ‌యాలు వ్య‌క్తం అవుతున్నాయి.
 
ఫ‌లితంగా క్రూడాయిల్ ధ‌ర‌లు 15 నెల‌ల క‌నిష్ట స్థాయికి ప‌డిపోయాయి. గ‌తేడాది ఉక్రెయిన్‌పై ర‌ష్యా సైనిక దాడికి దిగిన‌ప్ప‌ట్టి నుంచి ముడి చమురు ధరలు భారీగా పెరిగిపోయాయి. కొన్ని నెల‌ల పాటు బ్యారెల్ క్రూడాయిల్ 100 డాల‌ర్ల పైనే ట్ర‌డ్ అయ్యింది. కొన్ని నెల‌లుగా క్రూడాయిల్ ధ‌ర‌లు క్ర‌మంగా త‌గ్గుతూ 70 డాల‌ర్ల‌కు దిగి వ‌చ్చాయి.
 
తాజాగా మే ఫ్యూచ‌ర్స్ బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్పై రెండు శాతం త‌గ్గి 70 డాల‌ర్లు ప‌లుకుతున్న‌ది. మ‌రోవైపు, అమెరికా వెస్ట్ టెక్సాస్ ఇంట‌ర్మీడియ‌ట్ ఏప్రిల్ కాంట్రాక్ట్ ధ‌ర బ్యారెల్‌పై 64.86 డాలర్లు ప‌లికింది. దాదాపు 2021 డిసెంబ‌ర్ త‌ర్వాత ముడి చ‌మురు ధ‌ర త‌గ్గ‌డం ఇదే ప్ర‌థ‌మం.
 
అమెరికా, సిట్జ‌ర్లాండ్ బ్యాంకుల్లో సంక్షోభాల నేప‌థ్యంలో బ్రెంట్, డ‌బ్ల్యూటీఐ క్రూడాయిల్ ధ‌ర సుమారు 10 శాతం త‌గ్గిపోవ‌డం ఆస‌క్తి క‌ర ప‌రిణామం.అంత‌ర్జాతీయంగా క్రూడాయిల్ ధ‌ర‌లు త‌గ్గినా దేశీయంగా పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు ఇప్ప‌ట్లో త‌గ్గే అవ‌కాశాలు కనబడటం లేదు. కేంద్ర చ‌మురు సంస్థ‌లు కూడా 15 నెల‌లుగా పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు య‌ధాత‌థంగా కొన‌సాగిస్తున్నాయి. గ‌తంలో చ‌మురు ధ‌ర‌లు భారీగా ఉన్న‌ప్పుడు గ‌తేడాది ఏప్రిల్‌-సెప్టెంబ‌ర్ మ‌ధ్య చ‌మురు సంస్థ‌లు రూ.21 వేల కోట్ల మేర‌కు న‌ష్టాలు ప్ర‌క‌టించాయి. ప్ర‌స్తుత ధ‌ర‌ల ప్ర‌కారం లీట‌ర్ పెట్రోల్‌పై రూ.8.70, లీట‌ర్ డీజిల్‌పై రూ.11.1 చొప్పున కేంద్ర చ‌మురు సంస్థ‌లు లాభాలు గ‌డిస్తున్నాయి. వ‌చ్చే రెండు, మూడు త్రైమాసికాల్లో న‌ష్టాలు భ‌ర్తీ చేసుకున్న త‌ర్వాతే ధ‌ర‌లు త‌గ్గించే అవ‌కాశం ఉంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ ప‌డుతున్నారు.