రాహుల్ గాంధీ నివాసానికి పోలీసు అధికారులు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నివాసానికి ఆదివారం పోలీసు అధికారులు చేరుకోవడం కలకలం రేపింది. భారత్ జోడో యాత్ర సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మహిళల లైంగిక వేధింపులను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారంటూ ఢిల్లీ పోలీసులు ఆయనకు మార్చి 16న నోటీసులు జారీ చేశారు. సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా నోటీసులు పంపిన నోటీసులకు ఆయన సమాధానం ఇవ్వకపోవడంతో స్వయంగా ఆయన నుండి వివరాలు తీసుకొనేందుకు వచ్చారు.
 
భారత్ జోడో యాత్ర ముగింపు సందర్భంగా జనవరి 30న శ్రీనగర్‌లో ప్రసంగించిన రాహుల్ గాంధీ  మహిళలపై ఇంకా అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయని, యాత్రలో చాలామంది మహిళలు తనతో ఈ విషయం చెప్పారని ఈ పేర్కొనడం దుమారం రేపింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీకి నోటీసులు ఇచ్చామని, లైంగిక వేధింపులకు గురైన మహిళల వివరాలు తెలుసుకోవాలని భావిస్తున్నామని పోలీస్ వర్గాలు చెప్పాయి.
 
ప్రత్యేక కమిషనర్ ఆఫ్ పోలీస్ (శాంతిభద్రతలు) సాగర్ ప్రీత్ హూడా  సహా ఉన్నతాధికారులు రాహుల్ గాంధీ నివాసానికి చేరుకుని, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే, అది సుదీర్ఘయాత్ర అని, తనను చాలామంది కలిసారని, దానికి సంబంధించిన వివరాలను సమీకరించేందుకు వ్యవధి అవసరం అని రాహుల్ గాంధీ చెప్పారని హూడా తెలిపారు.
 
వివరాలు ఇస్తానని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని, ఆయన ఇవ్వగానే వాటిపై తాము దర్యాప్తు ప్రారంభిస్తామని చెప్పారు. యాత్ర సందర్భంగా తనను కలసిన చాలామంది మహిళలు తాము అత్యాచారాలకు గురైనట్లు రాహుల్ చెప్పడంతో బాధితులకు న్యాయం చేసేందుకు వాటి వివరాలు తెలుసుకొనేందుకు వచ్చామని హూడా పేర్కొన్నారు.
 
అయితే, రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నోటీసులు జారీలో ఎటువంటి చట్టబద్ధత లేదని పలువురు కాంగ్రెస్ నేతలు విమర్శించారు. ‘లైంగిక వేధింపులపై ప్రకటన చేసినంత మాత్రాన బాధితుల పేర్లను వెల్లడించమని ఆయనను బలవంతం చేయలేరు.. ఈ చర్య హానికరం.. బూటకమైంది’ అని జైరాం రమేష్ ధ్వజమెత్తారు.

మరోవంక, వివరాలు ఇవ్వకుంటే మరోసారి నోటీసులు జారీ చేస్తామని ఢిల్లీ పోలీస్ వర్గాలు స్పష్టం చేశాయి. ‘ఇది వ్యక్తుల జీవితం, భద్రతకు సంబంధించిన సున్నితమైన కేసు కాబట్టి, సాక్ష్యాలు, సాక్షులు తారుమారు కాకుండా చూసేందుకు సంబంధిత సమాచారాన్ని సేకరించేందుకు తమ బృందం కృషి చేస్తోంది’ అని తెలిపాయి.