చర్చ్ కు బీజేపీ అంటరాని పార్టీ కాదు

చర్చ్ కు బిజెపి అంటరాని పార్టీ కాదని స్పష్టం చేస్తూ రబ్బర్ రైతులకు ఎవరైతే ఎక్కువ ధర లభించేటట్లు చేస్తారో వారికి చర్చి తప్పనిసరిగా సహకారం అందిస్తుందని కేరళలో తలస్సేరి ఆర్చ్ బిషప్ మార్ జోసెఫ్ పాంప్లానీ స్పష్టం చేశారు.  తాను బిజెపికి మద్దతు ఇవ్వచూపినట్లు వచ్చిన కథనాలను కొట్టిపారవేస్తూ “అది కేంద్ర ప్రభుత్వం కానీవండి లేదా రాష్ట్ర ప్రభుత్వం కానీవండి ఎవరైతే రబ్బర్ రైతులకు మద్దతుగా ఉంటారో వారికి అండగా మేముంటాము” అని ఆయన తేల్చి చెప్పారు.
 
చర్చ్ ఏ పార్టీకి లేదా మతానికి మద్దతు ఇవ్వడం లేదా సహాయం చేయడం అంటూ జరగదని చెబుతూ బిజెపి అంతరాని పార్టీ కాదని తెలిపారు. “బిజెపితో చర్చ్ అసలు మాట్లాడకూడదు అనుకున్న సందర్భం అంటూ ఉందా? దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీతో మాట్లాడేందుకు నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. నేను వారితో అనేక విషయాల గురించి మాట్లాడాను. అటువంటి సంప్రదింపులు అన్ని రంగాలలో కొనసాగుతున్నాయి” అని తలస్సేరి ఆర్చ్ బిషప్ స్పష్టం చేశారు.
 
“నేను మాట్లాడిన మాటలను కాథలిక్ చర్చ్ విధానంగా చిత్రీకరించ నవసరం లేదు. ఆ సభలో నేను అత్యధికంగా ఉన్న రబ్బర్ రైతుల సమస్యల గురించి ప్రస్తావించాను. నా మాటలను చర్చ్, బిజెపిల మధ్య పొత్తుగా అభివర్ణించనవసరం లేదు” అంటూ ఆయన హితవు చెప్పారు.
 
తలస్సేరి ఆర్చ్ బిషప్ పరిధిలోని కాథలిక్ రైతుల సదస్సులో తాను చేసిన ప్రసంగం గురించి ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. “కేంద్ర ప్రభుత్వం రబ్బర్ ధరను కిలో రూ 300కు పెంచగలిగితే కేరళలో రాష్ట్రం నుండి ఒక ఎంపీని కూడా గెలిపించుకోలేక పోతున్న  పరిస్థితి నుండి బయటపడేందుకు కేరళలో బిజెపికి చర్చ్ సహకారం అందిస్తుంది” అని జోసెఫ్ పాంప్లానీ ప్రకటించారు.
 
అంతేకాదు, ఏ నిరసన అయినా ఎన్నికల సమయంలో ఓట్ల రూపంలో మారని పక్షంలో ప్రజాస్వామ్యంపై అర్థం ఉండబోదని అంటూ రైతులకు మద్దతు ఇస్తే తాము బిజెపికి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టమైన సంకేతం ఇచ్చారు. గత డిసెంబర్ నుండి రబ్బర్ ధర ప్రస్తుతం రూ 131 నుండి రూ 151 వరకు ఉంది. కేరళలో రబ్బర్ రైతులు, రబ్బర్ తోటలపై చాలావరకు చర్చ్ ప్రభావం ఉంది.
 
అంతేకాదు, చర్చ్ అంటరానితనంను పాటించాడని, కేరళలో అనేక సామజిక రుగ్మతలను తొలగించేందుకు కాథలిక్ చర్చ్ కృషి చేస్తూ వచ్చినదని కూడా ఆయన తెలిపారు. అందుకనే `అంటరానితనం’ అనేడిది తమ డిక్షనరీలోనే లేదని స్పష్టం చేశారు. ఇక్కడకు ఎవ్వరు వచ్చినా వారి మతం లేదా పార్టీతో సంబంధం లేకుండా స్వాగతం పలుకుతామని చెప్పారు.
 
రైతులు ఎదుర్కొంటున్న సమస్యలలో రబ్బర్ ధర ఒక్కటే కాదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ఎంవి గోవిందన్ చేసిన ప్రకటనను ప్రస్తావిస్తూ అది తీవ్రమైన అంశమే అని తేల్చి చెప్పారు. గోవిందన్ కు అది చాల చిన్న సమస్యగా కనిపించవచ్చని, కానీ రాష్ట్రంలోని రైతులలో అత్యధికులకు చాలా పెద్ద సమస్య అని తేల్చి చెప్పారు.