గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి

సమగ్ర ఎన్నారై, మైగ్రేషన్ పాలసీలో భాగంగా తెలంగాణ గల్ఫ్ వలస కార్మికుల రక్షణ, సంక్షేమం కొరకు తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ బిజెపి ఎన్నారై సెల్ గల్ఫ్ మిడిల్ ఈస్ట్ కన్వీనర్ నరేంద్ర పన్నీరు డిమాండ్ చేశారు.  శుక్రవారం జగిత్యాల ప్రెస్ క్లబ్ లో గల్ఫ్ వలసల అవగాహన పోస్టర్ విడుదల చేశారు.
 
కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం గల్ఫ్ మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని, గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి రూ. 500 కోట్ల వార్షిక బడ్జెట్ కేటాయించాలని, రేషన్ కార్డుల నుండి, ఓటర్ లిస్ట్ నుండి గల్ఫ్ కు వెళ్లిన వలస కార్మికుల పేర్లు తొలగించవద్దని ఆయన కోరారు. 
 
హైదరాబాద్ లో సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్ దేశాల కాన్సులేట్ లు (రాయబార కార్యాలయాలు) ఏర్పాటు అయ్యేలా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని నరేంద్ర కోరారు. ప్రవాస భారతీయ బీమా యోజన అనే రూ.10 లక్షల విలువైన ప్రమాద బీమా పథకంలో సహజ మరణంను కూడా చేర్చాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
 
విదేశాల నుండి వాపస్ వచ్చినవారు జీవితంలో స్థిరపడటానికి పునరావాసం, పునరేకీకరణ కొరకు ప్రత్యేక పథకాల రూపకల్పన చేయాలని, జైళ్లలో మగ్గుతున్న ప్రవాసులకు న్యాయ సహాయం (లీగల్ ఎయిడ్) ఇవ్వాలని కోరారు. 
 
గల్ఫ్ దేశాల్లో ఇబ్బందుల్లో ఉన్న కార్మికులు సహాయం కోసం, సలహా కోసం ఢిల్లీ లోని ప్రవాసి భారతీయ సహాయత కేంద్రం వారి ల్యాండ్ లైన్ నెంబర్లు +91 11 4050 3090 & +91 11 2688 5021 కాల్ చేయాలని నరేంద్ర సూచించారు. భారత్ లో ఉన్న కుటుంబ సభ్యులు కాల్ చేయవలసిన  టోల్ ఫ్రీ నెంబర్1800 11 3090 హైదరాబాద్ లోని క్షేత్రీయ ప్రవాసి సహాయత కేంద్రం +91 40 2777 2557 నెంబర్లకు కాల్ చేయాలి.
 
ఈ కార్యక్రమానికి జగిత్యాల బిజెపి జిల్లా అధ్యక్షులు మోరపెల్లి సత్యనారాయణ రావు, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ భోగ శ్రావణి పాల్గొన్నారు. గల్ఫ్ వలసల నిపుణులు మంద భీంరెడ్డి ముఖ అతిథిగా హాజరయ్యారు.