పేపర్ లీక్ లో రాజశేఖరే ప్రధాన సూత్రధారి

తెలంగాణాలో రాజకీయ కలకలం రేపుతున్న టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీక్ లో  ఈ కేసులో కీలక సూత్రధారి రాజశేఖరేనని, అతను ఉద్దేశ్యపూర్వకంగానే డిప్యూటేషన్‌పై టిఎస్‌పిఎస్‌సికి వచ్చినట్లు సిట్ నిర్ధారించింది. పేపర్ లీక్‌ కేసుపై టీఎస్‌పీఎస్సీకి సిట్ అందించిన నివేదికలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.  ఇతను టెక్నికల్ సర్వీస్ నుంచి డిప్యూటేషన్‌పై వచ్చాడు. అనంతరం ఇక్కడ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌గా ఉన్న ప్రవీణ్‌తో రాజశేఖర్ సంబంధాలు కొనసాగించాడు.

ఇక్కడ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్న రాజశేఖర్ కంప్యూటర్ హ్యాక్ చేసి పాస్‌వర్డ్‌ను దొంగతనం చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. అయితే పాస్ వర్డ్‌ను తాను ఎక్కడా రాయలేదని శంకర్ లక్ష్మీ చెబుతోంది. దానితో కంప్యూటర్‌ని హ్యాక్ చేసి పాస్‌వర్డ్‌ని రాజశేఖర్ దొంగిలించాడని తేల్చారు. పెన్‌డ్రైవ్ ద్వారా 5 పరీక్షా పత్రాలను రాజశేఖర్ కాపీ చేశాడని, కాపీ చేసిన పెన్‌డ్రైవ్‌ను ప్రవీణ్‌కు ఇచ్చాడని సిట్ నివేదికలో తెలిపారు.

ఏఈ పరీక్ష పత్రాన్ని ఉపాధ్యాయురాలు రేణుకకు ప్రవీణ్‌ అమ్మాడని తేల్చారు.  ఫిబ్రవరి 27నే రాజశేఖర్ పేపర్‌ను కాపీ చేశాడని తెలిపారు. గ్రూప్‌-1 పరీక్షాపత్రం లీకైనట్లు గుర్తించిన సిట్ ప్రవీణ్‌కు 103 మార్కులు రావడంపై విచారణ జరిపింది.  కమిషన్ సెక్రటరీ దగ్గర పిఎగా పనిచేస్తూ ప్రశ్నాపత్రాన్ని కొట్టేసినట్టుగా సిట్ నిర్ధారించింది.

మరో వైపు పేపర్ లీక్ కేసులో నిందితులకు న్యాయస్థానం ఆరు రోజుల కస్టడీ విధించింది. ఈ కేసులో ఇప్పటివరకు 9 మందిని సిట్ అరెస్టు చేసింది. ఈ క్రమంలో ఆదివారం నుంచి ఈ నెల 23 వరకు నిందితులను సిట్ కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. 
నిందితుల నుంచి మరింత సమాచారం రాబట్టే అవకాశం ఉంది. ఇంకెన్ని పేపర్‌లు లీక్ చేశారు? ఇంకా ఎంతమంది లీక్ వ్యవహారంలో ఇన్‌వాల్వ్‌మెంట్ ఉంది? ఇత్యాది వాటిపై సిట్ ప్రధానంగా నిందితులను ప్రశ్నించి సమా చారం రాబట్టే దిశగా ప్రయత్నిస్తోంది.

పేపర్ లీక్ వ్యవహారంపై సమగ్రంగా నిందితులను సిట్ విచారించే అవకాశం ఉంది. కాగా, ఎఆర్ శ్రీనివాస్ నేతృత్వంలో సిట్ ఏర్పాటైన దగ్గర్నుంచీ సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది.

ఓ యువకుడు ఆత్మహత్య

గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు  టిఎస్‌పిఎస్‌సి ప్రకటించడంతో మనస్థాపానికి గురైన 32 ఏళ్ల యువకుడు సిరిసిల్ల పట్టణంలో ఆత్మహత్య చేసుకున్నాడు. సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్ కు చెందిన చిటికెన నవీన్ (32) అనే యువకుడు గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షను టిఎస్‌పిఎస్‌సి రద్దు చేయడంతో మనస్థాపానికి గురయ్యాడు.
 
ఉద్యోగం లేదని, అన్ని ఉద్యోగాలకు కూడా అనర్హుడుని అవుతున్నానని మనస్తపంతో ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు ఎవరూ కారణం కాదని నవీన్ సూసైడ్ నోట్ కూడా రాశాడు. ఆరేళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న తనకు గ్రూప్–1 పరీక్ష రద్దు కావడంతో ‌నిరాశ కలిగిందని, ఇక ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదని, జీవితం‌పై విరక్తి వచ్చిందని సూసైడ్ లెటర్ లో రాసుకొచ్చాడు.