ప్రవీణ్ పెన్ డ్రైవ్ లో మొత్తం ఐదు ప్రశ్నాపత్రాలు!

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో ప్రధాన నిందితుడు ప్రవీణ్ ఇప్పటివరకు కేవలం ఏఈ పరీక్ష పేపర్ మాత్రమే లీక్ చేసిన్నట్లు భావిస్తుండగా, ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులకు అతని పెన్ డ్రైవ్‌లో 5 ప్రశ్నాపత్రాలు లభించాయి. దానితో గత ఏడాది జరిగిన గ్రూప్ -1 తో పాటు మరిన్ని ప్రశ్నపత్రాలను లీక్ చేశారో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇప్పటికే ఈ నెల 5న జరిగిన ఎఇ పరీక్షను రద్దు చేసింది. ఈ క్రమంలో మిగిలిన 4 విభాగాల పరీక్షా పత్రాలు మార్చాలని కమీషన్ నిర్ణయించింది. ప్రవీణ్ పెన్ డ్రైవ్ ను సీజ్ చేసిన పోలీసులు  ఎఫ్ఎస్‌ఎల్‌ కి పంపించి విశ్లేషించారు. అయితే ఇందులో కేవలం ఏఈ పరీక్షా పత్రం కాకుండా టౌన్‌ప్లానింగ్‌, వెటర్నరీ అసిస్టెంట్‌, గ్రౌండ్‌ వాటర్‌ డిపార్ట్‌మెంట్‌, అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు కూడా గుర్తించినట్లు తెలుస్తోంది.

ఇక కేవలం ప్రవీణ్ పెన డ్రైవ్ మాత్రమే కాకుండా ఈ కేసులో అరెస్ట్ అయిన తొమ్మిది మంది నిందితుల ఫోన్లను కూడా పోలీసులు ఎఫ్ఎస్‌ఎల్‌ కి పంపించారు. మరోవైపు నిందితుల కస్టడీకి కోర్టు అనుమతి ఇస్ మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

కాగా,  ప్రశ్నాపత్రాల కొనుగోలు కోసం తన సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులతో రేణుక సంప్రదింపులు చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఆమె తన సోదరుడు రాజేశ్వర్‌ నాయక్‌కు ఏఈ ప్రశ్నపత్రాలు కావాలంటూ రూ.10 లక్షలకు ప్రవీణ్‌తో రేణుక బేరం కుదుర్చుకుంది. టీటీసీ చదివిన రాజేశ్వర్‌ కాంట్రాక్టు ఉద్యోగం చేస్తున్నాడు. ఏఈ పరీక్ష రాసేందుకు కావాల్సిన విద్యార్హత అతనికి లేదు. అయినా అతని కోసం ప్రశ్నపత్రం కావాలని ప్రవీణ్‌తో చెప్పింది.

అదే సమయంలో ప్రశ్నపత్రాలు సమకూరుస్తానంటూ మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన కె.నీలేష్‌నాయక్‌, పి.గోపాల్‌ నాయక్‌లతో రేణుక రూ.14 లక్షలకు బేరం కుదుర్చుకుంది. వారి వద్ద డబ్బులు తీసుకుని ప్రవీణ్‌కు ఇచ్చింది. ఆ డబ్బును ప్రవీణ్‌ తన బ్యాంకు ఖాతాలో జమ చేశాడు. రాజమండ్రిలో ఉన్న తన బాబాయికి ప్రవీణ్‌ రూ.3.5 లక్షలు ఆన్‌లైన్‌లో పంపినట్టు పోలీసులు గుర్తించారు.

పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో ఔట్ సోర్సింగ్‌లో పనిచేస్తున్న ఉద్యోగి రాజశేఖర్‌కు ప్రవీణ్‌ డబ్బు ఆశ చూపించి ప్రశ్నపత్రాలను సంపాదించాడు. రేణుక ఇచ్చిన రూ.10 లక్షల్లో అతనికి కొంత ఇస్తానని చెప్పాడు. ఈలోపే పేపర్ లీక్ వ్యవహారం బయటపడటంతో రాజశేఖర్‌కు సొమ్ము అందలేదని పోలీసులు గుర్తించారు.