బిజెపి బలపరచిన ఎవిఎన్ రెడ్డి ఎమ్యెల్సీగా ఘనవిజయం

కేసీఆర్ ప్రభుత్వం పట్ల విద్యావంతులలో, ముఖ్యంగా ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులలో నెలకొన్న ఆగ్రవేశాలు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఉపాధ్యాయుల నియోజకవర్గం నుండి రాష్ట్ర శాసనమండలికి జరిగిన ఎన్నికలలో స్పష్టంగా వెల్లడయ్యాయి. ఊహించని విధంగా బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చే ఫలితాలు వచ్చాయి.
 
ఉపాధ్యాయ ఎమ్యెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరచిన తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టిపియుఎస్) అభ్యర్థి ఎ వెంకట నారాయణ రెడ్డి (ఎవిఎన్ రెడ్డి) 13,436 ఓట్లతో విజయం సాధించారు. . సమీప పీఆర్‌టీయూ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డిపై ఏవీఎన్​రెడ్డి విజయం సాధించారు. ప్రశ్నించే గొంతుకగా శాసన మండలిలో అడుగుపెట్టబోతున్నారని ఉపాధ్యాయులు, విద్యావంతులు సంబరాలు చేసుకుంటున్నారు.
పిఆర్టియు, టిఎస్యూటిఎఫ్ వంటి పేరొందిన ఉపాధ్యాయ సంఘాల అభ్యర్థులను వెనక్కి నెట్టి టిపియుఎస్  లాంటి జాతీయవాద సైద్ధాంతిక సంఘం అనూహ్య విజయం సాధించింది.  గత ఎనిమిదేళ్లుగా ఉపాధ్యాయ సంక్షేమాన్ని గాలికొదిలి, విద్య రంగాన్ని‌ నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వ విధానాలు కారణమైతే, తమ సమస్యలను పరిష్కరించడానికి తమ సంఘ నాయకులపై విశ్వాసంతో మండలి ఎన్నికల్లో ఓటేసి గెలిపిస్తే ప్రభుత్వం చంకనెక్కి కూర్చున్న అసమర్థ నాయకత్వం ఒక కారణంగా భావిస్తున్నారు.
వేతనాలు ఠంచనుగా ఒకటవ తేదీన రాకపోవడం, డీఏలు, పిఆర్సీ బకాయిలు, జిఓ నం 317,పండిత్ లు, పీఈటీల అప్ గ్రేడేషన్, బదిలీలు, పదోన్నతుల వంటి‌ సమస్యలతో విసిగిపోయిన ఉపాధ్యాయ లోకం తమ ఓటుతో ఈ పెద్ద సంఘాలను మట్టి కరిపించిన్నట్లు స్పష్టం అవుతుంది.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రేరణతో  విద్య రంగంలో జాతీయవాద భావజాలాన్ని  విస్తరించడానికి, భారతీయ సాంస్కృతిక వైభవ పునరుజ్జీవనానికి పనిచేస్తున్న అఖిల భారతీయ రాష్ట్రీయ శైక్షిక్  మహాసంఘ్ (ఎబిఆర్ఎస్ఎస్)కు అనుబంధంగా పని చేస్తున్న తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్ టిపియుఎస్) విజయం సాధించడం తెలంగాణాలో ఉపాధ్యాయ ఉద్యమంలో కీలక మలుపుగా భావించవచ్చు.
రెండు తెలుగు రాస్త్రాలలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలలో జాతీయవాద సంస్థలకు ఉన్న బలం అంతంతమాత్రమే. ముఖ్యంగా ఉపాధ్యాయ ఎమ్యెల్సీ ఎన్నికలలో ఎప్పుడు కనీసం రెండో స్థానంలోకి కూడా రాలేదు. మొత్తం ఉపాధ్యాయులలో టిపియుఎస్ బలం 10 శాతం మించి ఉండకపోవచ్చు.  అయినా, కాకలుతీరిన ఉపాధ్యాయ సంఘాల అభ్యర్థులను ఓడించి ఘన విజయం సాధించడం అంటే అధికార పార్టీ పట్ల ఉపాధ్యాయులతో నెలకొన్న ఆగ్రవేశాలు, వారితో కుమ్మక్కయి ఉపాధ్యాయుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్న ఉపాధ్యాయ సంఘాల పట్ల నెలకొన్న వ్యతిరేకతను ఈ ఎన్నికలు స్పష్టం చేశాయని చెప్పవచ్చు.
రాష్ట్రంలో కొనసాగుతున్న అప్రజాస్వామిక పాలనపై ఉపాధ్యాయ మహాశయులు అద్భుతమైన తీర్పు ఇచ్చారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ నెల13న టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ జరిగింది. మొత్తం 29,720 ఓట్లలో 25,866 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 452 ఓట్లు చెల్లలేదు. గురువారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రియాంక అలా సారథ్యంలో సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది.
గురువారం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు పక్రియ శుక్రవారం ఉదయం 4 గంటలకు పూర్తయింది. గురువారం సాయంత్రం 5 గంటలకు మొదటి ప్రాధాన్య  ఓట్ల లెక్కింపు పూర్తవగా… ఏ అభ్యర్థికీ సరైన మెజార్టీ 50 శాతానికి మించి దక్కలేదు. అనంతరం రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు మొదలైంది.