
రాష్ట్రంలో మరో ఏడాదిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో 2023-24 వార్షిక బడ్జెట్ రూ.2,79,279.27 కోట్లతో గురువారం ఆర్ధిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదింపజేశారు. గత బడ్జెట్తో పోలిస్తే రెవెన్యూ వ్యయం రూ. 22.985 కోట్లు అదనంగా పెరిగింది. 2022-23 సంవత్సరానికి సంబంధించి రూ.2,56,256 కోట్లను కేటాయించారు.
దీంతో గత ఏడాది బడ్జెట్తో పోలిస్తే ప్రస్తుత బడ్జెట్లో రూ.23,023 కోట్ల మేర బడ్జెట్లో పెరుగుదల ఉంది. బీసీ సంక్షేమానికి గతంతో పోలిస్తే అదనంగా 32.5 శాతం నిధులను కేటాయించారు. 2022-23 బడ్జెట్లో రూ. 29.143 కోట్లు కేటాయించగా ఈబడ్జెట్లో వారి సంక్షేమానికి రూ. 38,605 కోట్లను కేటాయించారు.
అలాగే సంక్షేమ పథకాలకు సంబంధించి 10 శాతం అదనంగా నిధులను కేటాయించారు. గత బడ్జెట్లో రూ. 48,882 కోట్లు కేటాయించగా ఈబడ్జెట్లో రూ. 54,208 కోట్లను కేటాయించారు. బడ్జెట్లో విద్య, వైద్య రంగానికి కేటాయింపులను పెంచారు. గత ఏడాది రూ. 30.077 కోట్లు విద్యా రంగానికి కేటాయించగా ప్రస్తుత బడ్జెట్లో రూ.32,179 కోట్లు కేటాయిస్తూ ఆరంగానికి 7 శాతం నిధులను పెంచారు.
అలాగే వైద్య రంగానికి సంబంధించి గతంలో రూ. 15,384 కోట్లు కేటాయించగా ప్రస్తుత బడ్జెట్లో రూ. 15,882 కోట్లు కేటాయిస్తూ 3.2 శాతం నిధులను అదనంగా వైద్య రంగానికి కేటాయించారు.
ప్రస్తుత వార్షిక బడ్జెట్లో వ్యవసాయ, అనుబంధ రంగాలకు ఏకంగా రూ.41,436.29 వేల కోట్లను కేటాయించారు. గత ఏడాదితో పోలిస్తే రూ. 4 వేల కోట్లు అదనంగా కేటాయింపులు చేశారు. 2022-23 సంవత్సరానికి సంబంధించి రూ. 37,343.57 కోట్లు కేటాయించారు. 2014-15 నుండి గడచిన దశాబ్దకాలంలో వ్యవసాయ రంగానికి చేపట్టిన కేటాయింపులను పరిశీలిస్తే ప్రస్తుత కేటాయింపులే అధికం.
గత బడ్జెట్తో పోలిస్తే ఈ బడ్జెట్లో కేంద్రం నుండి రావల్సిన పన్నుల వాటా ఆదాయం పెరిగింది. గత ఏడాది రూ.38,176 కోట్ల మేర మాత్రమే కేంద్రం నుండి పన్నుల రూపంలో రాబడి ఉండగా ప్రస్తుత బడ్జెట్లో అది రూ. 41,338 కోట్లుకు పెరిగింది. మొత్తం మీద రూ. 3 వేల కోట్లకుపైగా కేంద్రం నుండి ప్రస్తుత ఏడాది పన్నుల రూపంలో రాబడి పెరగనుంది.
More Stories
వివేకా హత్యకేసులో విచారణాధికారిని మార్చమన్న సుప్రీంకోర్టు
కృష్ణాజలాల పున:పంపిణీ సాధ్యం కాదన్న టైబ్యునల్
నింగిలోకి దూసుకెళ్లిన ఎల్వీఎం – 3 రాకెట్