ఎంపీ అవినాష్ రెడ్డికి హైకోర్టు షాక్

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ తీరు, అరెస్ట్ చేయొద్దంటూ దాఖలు చేసిన పిటీషన్ లను శుక్రవారం కొట్టివేసింది. వివేకానందరెడ్డి హత్య కేసులో.. అవినాష్ రెడ్డిని విచారించుకోవచ్చని,  అందుకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది.

విచారణ ఆపాలని ఆదేశించలేం అంటూ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటీషన్ ను కొట్టివేసింది హైకోర్టు. ఇదే సమయంలో మరో కీలక నిర్ణయం కోర్టు నుంచి వచ్చింది. అరెస్ట్ చేయొద్దన్న అవినాష్ రెడ్డి వాదనలను తోసిపుచ్చింది. సీబీఐకి అనుకూలంగా తీర్పు వెల్లడించింది కోర్టు. అరెస్ట్ చేయొద్దని కోర్టు చెప్పలేమని గతంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించింది.

అవసరం అనుకుంటే, విచారణ సందర్భంగా కస్టడీలోకి తీసుకోవాలి అనుకుంటే, అందుకు తగ్గట్టుగానే నిర్ణయం తీసుకోవచ్చని స్పష్టం చేసింది తెలంగాణ హైకోర్టు. పిటీషన్ పై తీర్పు తర్వాత.. కోర్టుకు ఇచ్చిన ఆధారాలను సీబీఐకి తిరిగి ఇచ్చేసింది. సీబీఐ తనను అరెస్ట్ చేయకుండా చూడాలని, తన విచారణను ఆడియో, వీడియో రికార్డు చేయాలని తెలంగాణ హైకోర్టును  వైఎస్ అవినాష్ రెడ్డి ఆశ్రయించారు.

సీబీఐ విచారణకు సహకరించాలని అవినాశ్‌రెడ్డికి హైకోర్టు ఆదేశాలివ్వడం గమనార్హం. అయితే విచారణను ఆడియో, వీడియో రికార్డు చేయాలని హైకోర్టు సీబీఐకి సూచించింది. అవినాష్‌రెడ్డి విచారణ ప్రాంతానికి న్యాయవాదిని అనుమతించలేమని తేల్చి చెప్పింది. అయితే అవినాష్‌రెడ్డి కనిపించేలా న్యాయవాదిని అనుమతించాలని కోర్టు సూచించింది .

అవినాశ్‌రెడ్డిని ఇప్పటికే నాలుగుసార్లు పిలిపించి ప్రశ్నించింది. ఆయన తండ్రి భాస్కర్‌ రెడ్డి పైనా దృష్టి సారించింది. తండ్రీకొడుకులిద్దరినీ కలిపి ప్రశ్నించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ కీలక నిందితులని, అరెస్టు చేయడం ఖాయమని సీబీఐ తెలంగాణ హైకోర్టుకే స్పష్టం చేసింది.