పట్టభద్రుల చేతుల్లో వైసీపీకి పరాభవం

రాయలసీమలో రెండు ఉపాధ్యాయ ఎమ్యెల్సీ స్థానాలను స్వల్ప ఆధిక్యతతో గెల్చుకున్న అధికార వైసీపీకి మూడు పట్టభద్రుల ఎమ్యెల్సీ ఎన్నికలలో మాత్రం పరాభవం ఎదురైంది. రెండు స్థానాలను భారీ ఆధిక్యతతో కోల్పోగా, మరోస్థానంలో బొటాబొటి ఆధిక్యతతో కొనసాగుతున్నది.  108 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో గల ఈ మూడు నియోజకవర్గాలలో పట్టభద్రుల నుండి తీవ్రమైన ప్రభుత్వ వ్యతిరేకత ఎదురుకావడం అధికార పార్టీకి ఆందోళన కలిగిస్తున్నది.

ముఖ్యంగా వైసీపీకి కంచుకోటగా భావించే రాయలసీమలో పేలవమైన ఫలితాలు రావడం, చివరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత  జిల్లా కడపలో సహితం చెప్పుకోదగిన ఓట్లు రాకపోవడం, ముఖ్యంగా పులివెందులలో టిడిపి అభ్యర్థితో పోల్చుకొంటే సగం ఓట్లకు పరిమితం కావడం కలకలం రేపుతోంది.

ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేపాడ చిరంజీవి రావు ఘన విజయం సాధించారు. రెండు రోజుల పాటు ఉత్కంత భరితంగా సాగిన ఎన్నికల కౌంటింగ్‌లో మేజిక్ ఫిగర్ దాటేశారు. మొదటి ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపులో 50 శాతానికి పైగా ఓట్లు రాకపోవడంతో ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు లెక్కించారు.

టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు రెండో ప్రాధాన్య ఓటుతో విజయం సాధించారు. తొలి ప్రాధాన్యత ఓట్లలో ఎనిమిది రౌండ్లు పూర్తయ్యేసరికి చిరంజీవిరావుకు 82,958 ఓట్లు దక్కాయి.  వైసీపీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్‌కు 55,749 ఓట్లు, పీడీఎఫ్‌ అభ్యర్థి రమాప్రభకు 35,148 ఓట్లు పడ్డాయి.  బీజేపీ అభ్యర్థి పీవీఎన్‌ మాధవ్‌కు కేవలం 10,884 ఓట్లు పోలయ్యాయి.

విశాఖపట్నంను రాజధానిగా చేస్తున్నామని విస్తృతంగా ప్రచారం చేసినా, విశాఖకు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొస్తున్నామంటూ చెప్పుకున్నా విద్యావంతులు అధికార పక్షం పట్ల విముఖత చూపారు.

మరోవైపు తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్  వైసీపీ అభ్యర్ధిపై భారీ ఆధిక్యం సాధించారు. రెండో ప్రాధాన్య ఓట్లతో కలిపి టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్‌  వైసీపీ అభ్యర్థి శ్యాంప్రసాద్‌రెడ్డిపై విజయం సాధించారు. కంచర్ల శ్రీకాంత్‌  1,12,686 ఓట్లు సాధించగ, శ్యామ్ ప్రసాద్ రెడ్డికి 85,423 ఓట్లు వచ్చాయి. అర్ధరాత్రి వరకూ రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు కొనసాగింది. 

పశ్చిమ రాయలసీమ (కడప- అనంతపురం- కర్నూలు జిల్లాల) పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు హోరాహోరీగా సాగుతోంది. అయితే, ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రతి రౌండ్‌లోనూ టీడీపీ, వైసీపీ అభ్యర్థుల మధ్య ఆధిక్యత మారుతూ వస్తోంది. ప్రస్తుతం వైసీపీ స్వల్ప ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది.