పేపర్ లీకేజీ బాధ్యుడు కేటీఆరే

 
‘‘పేపర్ లీకేజీ బాధ్యుడు నీ కొడుకే… టీఎస్పీఎస్సీ కంప్యూటర్ల నిర్వహణ బాధ్యతంతా ఐటీ శాఖదే… మరి ఆయనను బర్త్ రఫ్ చేస్తారా?’’అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు.
 
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై జరిగిన పోరాటంలో అరెస్టై చంచల్ గూడ జైల్లో ఉంటున్న బీజేవైఎం నాయకులను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ విషయంపై ప్రజాస్వామ్యబద్దంగా ఆందోళన చేస్తున్న బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు భానుప్రకాశ్ తోపాటు కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేసి, జైలుకు పంపడం దుర్మార్గం అని విమర్శించారు.
 
ఏడుగురు కార్యకర్తలను జైల్లో వేశారని అంటూ లీకేజీపై ప్రశ్నించడమే వారు చేసిన తప్పని పేర్కొన్నారు.  అసలు పేపర్ లీకేజీ ఎట్లా అయ్యంది? టీఎస్పీఎస్సీ ఛైర్మన్ కు తెలియకుండా ఎట్లా లీకైంది? అని ప్రశ్నించారు. ముందు వాళ్లను ప్రాసిక్యూట్ చేయాలని స్పష్టం చేశారు. నేరస్తులను కాపాడుకునేందుకే సిట్ వేశారని ఆరోపించారు. 
 
కేసీఆర్ ఫ్యామిలీ తప్పు చేయకపోతే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించడానికి అభ్యంతరమేంది? అని నిలదీశారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు రేణుక అమ్మ బీఆర్ఎస్ సర్పంచ్ , వాళ్ల అన్న బీఆర్ఎస్ నాయకుడు అని గుర్తు చేశారు. మరి పేపర్ లీకేజీ ఎవరి కోసం అయ్యింది? అని ప్రశ్నించారు.  టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేసినవాళ్లంతా బీఆర్ఎస్ కార్యకర్తలేనని, వాళ్లందరూ ఎదో ఒక పదవితో సంబంధం ఉన్నవాళ్లేనని తెలిపారు. ఈ ఘటనలో కారణం అయిన నిందితులను బీఆర్ఎస్ పార్టీ కాపాడే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు.
 
బీజేపీ లీక్ చేశారని చెబుతున్న వాళ్లంతా ఎందుకు ఆధారాలు చూపడం లేదు? రేణుకకు గురుకులం స్కూళ్లో ఉద్యోగం ఇచ్చారు? ఆమె కోసమే పేపర్ లీక్ చేసిన విషయం బహిర్గతమైంది? అంటూ సంజయ్ ప్రభుత్వాన్ని నిలదీశారు.  పరీక్షలు కూడా నిర్వహించలేని చేతగానితనం కేసీఆర్ సర్కార్ ది అంటూ ధ్వజమెత్తారు. తక్షణమే జరిగిన పరిణామాలకు బాధ్యులైన వారందరిపై చర్యలు తీసుకోవాలని, ఛైర్మన్ ను తొలగించాలని డిమాండ్ చేశారు.