కేసీఆర్ కుటుంబంలో మొదటి వికెట్ కవిత

కేసీఆర్ కుటుంబంలో మొదటి వికెట్ కూతురు కవిత నుండే ప్రారంభమైందని.. తర్వాత కొడుకు, అల్లుడే ఉన్నారని బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి స్పష్టం చేశారు. హైదరాబాద్ వనస్థలిపురంలో మహిళ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆమె మహిళకు మెతక వైఖరి పనికిరాదని, దృఢంగా ఉండాలని సూచించారు.

బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళకు రక్షణ లేదని విజయశాంతి విమర్శించారు. పామ్ హౌస్ లో ఉంటూ సీఎం కేసీఆర్ 4లక్షల రూపాయల తీసుకుంటాడు.. కానీ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడని ఆరోపించారు. అధికార పార్టీ మహిళ సర్పంచ్ పట్ల అసభ్యంగా మాట్లాడిన ఓ ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె మండిపడ్డారు.

ఎమ్మెల్సీ కవిత లిక్కర్ డాన్ అని పేర్కొంటూ కవితను ఈడీ, సీబీఐ లు పిలుస్తే వెళ్లరు, తప్పు చేసి మహిళ అని తప్పించుకుందాం అనుకుంటున్నారని ఆమె విమర్శించారు. కేసీఆర్ కుటుంబం మొత్తం క్రిమినల్ మైండ్ ఉన్న నాయకులే అని ఆమె ఆరోపించారు. గంజాయి, డ్రగ్స్ కు ఈ రాష్ట్రం అడ్డాగా తయారు అయిందని విజయశాంతి ఆందోళన వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యేలు కూడా మహిళలను వదలకుండా వేధిస్తున్నారని అంటూ ఏనాడైనా సీఎం కేసీఆర్ మహిళలను ఇబ్బంది పెడుతున్న ఎమ్మెల్యేను సస్పెండ్ చేశాడా? అని విజయశాంతి ప్రశ్నించారు. మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా కేసీఆర్ ఇదే విధంగా చలనం లేకుండా ఉంటున్నాడని ఆమె మండిపడ్డారు.

అవసరానికి పని చేయించుకొని అవతలికి పొమ్మంటడు కేసీఆర్.. మహిళలు స్వతంత్రంగా బతికే స్వేచ్ఛను ఇచ్చే విధంగా సీఎం విధానాలు లేవని ఆమె ధ్వజమెత్తారు. కల్వకుంట్ల తండ్రీకొడుకులు మాట్లాడితే చిన్న పిల్లలు టీవీలు చూసే పరిస్థితి లేదని ఆమె ఎద్దేవా చేశారు. కేసీఆర్ కూతురు లిక్కర్ డాన్ గా మారిందని పేర్కొంటూ మహిళలకు ఎక్కడైన లిక్కర్ అనే ఆలోచన వస్తుందా? అని విజయశాంతి నిలదీశారు