ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈడీ నోటీసులపై తనకు తాత్కాలిక ఊరట ఇవ్వాలన్న ఆమె పిటిషన్ ను తోసిపుచ్చింది సుప్రీంకోర్టు. విచారణపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది సుప్రీంకోర్టు.

కవిత దాఖలు చేసిన పిటీషన్ పై విచారణను మార్చి 24వ తేదీకి వాయిదా వేసింది కోర్టు. మార్చి 16న ఈడీ అధికారుల ఎదుట ఎమ్మెల్సీ కవిత హాజరు కావాల్సింది ఉంది. ఈ సమయంలోనే విచారణకు బ్రేక్ వేయాలంటూ, ఈడీ ఎదుట హాజరయ్యేందుకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఆమె బుధవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

ఇక లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే మార్చి 11న కవితను 9 గంటల పాటు విచారించారు ఈడీ అధికారులు. 16వ తేదీన మరోసారి విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. ఇతరులతో కలిపి విచారిస్తామని తనకు ఇచ్చిన నోటీసులో ఈడీ అధికారులు పేర్కొన్నారని, కానీ వాస్తవానికి అలా విచారణ చేపట్టలేదని పిటిషన్ లో పేర్కొన్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండానే తన ఫోన్ సీజ్ చేశారని ఆమె ఆరోపించారు.

 సీఆర్ పీసీ 160 సెక్షన్ ప్రకారం మహిళను తన ఇంట్లోనే విచారించాలని, కానీ ఈడీ కార్యాలయానికి పిలిచారని అభ్యంతరం తెలిపారు. అయితే ఈ పిటిషన్ పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించింది. 24న విచారణ జరుపుతామని చెప్పింది.
తెలంగాణలో భారీ లిక్కర్ స్కాం

ఇలా ఉండగా, ఢిల్లీకి మించి తెలంగాణలో భారీ లిక్కర్ స్కాం జరిగిందని  బీజేపీ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఆరోపించారు. త్వరలో ఆధారాలతో సహా బయట పెడతామని వెల్లడించాయిరు. ఫారిన్ లిక్కర్ సేల్స్‌లో ఒక వ్యక్తికి వందల కోట్లు లబ్థి చేకూరుతుందని ఆయన తెలిపారు. ఫారిన్ లిక్కర్ పాలసీకి ఐదేళ్ళ కాలపరిమితి ఇవ్వటానికి కారణమేంటో తేలాలన్నారు. ఫారిన్ లిక్కర్ టెండర్‌కు 24 గంటలే సమయం ఇవ్వటానికి కారణమేంటని  ఆయన ప్రశ్నించారు.

 
టెండర్‌లో కేవలం ఒక్క అప్లికేషన్ మాత్రమే ఎందుకొచ్చిందని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. హైదరాబాద్‌లో ఒక వైన్స్‌లో రోజుకు కోటి రూపాయలు సేల్స్ ఉంటోందని ఆయన తెలిపారు. ప్రభుత్వానికి రావాల్సిన డిస్కౌంట్ ఒక ప్రైవేట్ వ్యక్తికి వెళ్తోందని ధ్వజమెత్తారు. షాపు పేరు.. వ్యక్తి పేరు త్వరలో బయట పెడతామని మాజీ ఎంపీ వెల్లడించారు.