9న విచారణకు రాలేనన్న కవిత.. ఆమె ప్రకటనలపై బిజెపి ధ్వజం

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మార్చి 9న ఈడీ విచారణకు హాజరుకాలేనని పేర్కొంటూ బిఆర్ఎస్ ఎమ్యెల్సీ కవిత లేఖ రాశారు. ఈ నెల 15 తర్వాత విచారణకు వస్తానని చెబుతూ ఈ నెల 10న ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద దీక్ష ఉన్నందున సమయం కావాలని కోరారు.  మార్చి 9వ తేదీన విచారణకు హాజరుకావాలని ఈడీ పంపిన నోటీసులకు సమాధానంగా ఈ లేఖ వ్రాసారు.
 
కాగా, ఈడీ విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని, లిక్కర్ స్కాంలో తాను చేసిందేమీ లేదని అంతకు ముందు ఆమె చెప్పారు. ఒకవేళ తనను అరెస్ట్ చేస్తే ప్రజల దగ్గరకు వెళ్తానని పేర్కొంటూ ఈ కేసులో సీరియస్ ఆరోపణలు లేవని తెలిపారు. ఫోన్లను తాను ధ్వంసం చేయలేదని, అడిగితే ఫోన్లను దర్యాప్తు సంస్థలకు ఇస్తానని కవిత చెప్పారు.
 
బీజేపీ టార్గెట్ తాను కాదని, వారి టార్గెట్ సీఎం కేసీఆర్ అని ఆరోపిస్తూ ఢిల్లీ లిక్కర్ స్కాంలో తన పాత్ర లేదని, తాను ఎవరికీ భయపడనని తెలిపారు. పైగా, ప్రజా వ్యతిరేకత, అణచివేత చర్యలకు తెలంగాణ ఎప్పుడూ తలవంచదని  కవిత ట్విట్టర్‌లో ప్రకటించారు.  కాగా కవితపై 177/ఎ, 120/ బి , 7 పిసి చట్టం కింద ఈడీ కేసులు నమోదు చేసింది. 17 ఆగస్టు 2022 లో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా కవితను అధికారులు విచారించనున్నారు.
 
అయితే కవిత ప్రకటనను బిజెపి నేతలు తిప్పికొడుతున్నారు. కవితను తలవంచమని ఎవరూ చెప్పటం లేదని పేర్కొంటూ తప్పులు లేకుంటే నిజాయితీని నిరూపించుకోవాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి హితవు చెప్పారు. తెలంగాణ సమాజం అంటే మీ కుటుంబమేనా..? అని ప్రశ్నించారు. ‘ఢిల్లీకి వెళ్లి లిక్కర్ వ్యాపారం చేసింది.. సెల్ ఫోన్ పోన్లు పగల కొట్టింది.. అక్రమార్కులతో చేయి కలిపింది ఎవరో చెప్పాలి’ అని కిషన్ రెడ్డి నిలదీశారు.
 
చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెబుతూ ఈడీ కేసుతో బీజేపీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. నోటీసులకే ఉలిక్కి పడితే ఎలా.. అరెస్టు చేయలేదు కదా..? అంటూ ఎద్దేవా చేశారు. చేసిన తప్పులు అన్నీ చేసి మీ తప్పులపై నోటీసులు ఇస్తే.. తెలంగాణ సమాజానికి ముడిపెట్టి.. రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
లిక్కర్ స్కాంలో కవితతోపాటు అందరికీ నోటీసులు ఇచ్చారని, ఆమెకు ప్రత్యేకంగా ఏమీ ఇవ్వలేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణ గుర్తు చేశారు. దీన్ని కక్ష సాధింపుగా బీఆర్ఎస్ రాజకీయం చేస్తుందని ఆమె మండిపడ్డారు. తెలంగాణ ఆత్మగౌరవం అంటే కవిత ఒక్కరే కాదని.. తెలంగాణ సమాజం అని స్పష్టం చేశారు.
 
తెలంగాణ ఉద్యమంలో  తెలంగాణ ఎప్పుడూ ఎవరికీ తలవంచలేదు కానీ  ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కాంలో మీ ప్రమేయం ఉందని ఈడీ చెప్పడంతో  దేశం ముందు సిగ్గుతో తలవంచుతోందని ఎంపీ ధర్మపురి అర్వింద్   విమర్శించారు.  లిక్కర్ స్కాం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే మహిళా రిజర్వేషన్ బిల్లు పేరుతో  కవిత జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్నారని ధ్వజమెత్తారు.
 
దొంగ సారా, చీప్ లిక్కర్ అమ్మితే.. అరెస్ట్ చేయరా అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం తల వంచుకునే పరిస్థితిని కవిత తీసుకొచ్చారని విమర్శించారు. తెలంగాణ తల వంచదు కాదు కవిత.. తల వంచుకునేలా చేశావు అంటూ దుయ్యబట్టారు.