ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత ప్రతినిధి అరుణ్ పిళ్లై అరెస్ట్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో పది మంది అరెస్టు కాగా తాజాగా మరొకరిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. సౌత్ గ్రూపులో ఎమ్మెల్సీ కవిత ప్రతినిధి అరుణ్ రామచంద్రపిళ్లైని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మంగళవారం అరెస్ట్ చేసింది.

 రెండు రోజులుగా విచారించి అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించింది. న్యూఢిల్లీలోని రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్ట్ లో ప్రవేశపెట్టనున్నారు. ఈ కేసులో మనీ ల్యాండరింగ్ జరిగిందనే ఆధారాలతో జనవరి 25న అరుణ్ పిళ్లై ఆస్తుల ఈడీ అటాచ్ చేసింది. రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలోని రూ.2.25 కోట్లు విలువ చేసే ల్యాండ్‌ను జప్తు చేసింది.

దీంతో ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య 11 కు చేరింది. సౌత్‌గ్రూప్‌లో ఇండో స్పిరిట్‌ ఎండీ సమీర్‌‌మహేంద్రు, ఎమ్మెల్సీ కవిత కీలకంగా వ్యవహరించారు. కవిత తరుపున అరుణ్ పిళ్లై మీటింగ్స్ లో పాల్గొన్నారని ఈడీ చార్జిషీట్ లో పేర్కొంది. పలు దఫాలుగా రామచంద్ర పిళ్లై ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన మీదట దర్యాప్తు సంస్థలు కీలక సమాచారాన్ని సేకరించినట్టు తెలుస్తోంది.

 ఈ కేసులో దాఖలు చేసిన చార్జిషీట్లలో అరుణ్ రామచంద్ర పిళ్లై పేరు కూడా ఉంది. ఇప్పటి వరకూ ఈ కేసులో అరెస్టైన వారిలో ఎక్కువగా హైదరాబాద్‌కు చెందిన వారే ఉండటం గమనార్హం. లిక్కర్ స్కామ్ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులు ఇటీవల ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను అరెస్టు చేసిన విషయం తెలిసిందే!

 సోమవారంతో కస్టడీ ముగియగా అధికారులు సిసోడియాను కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించగా  పోలీసులు సిసోడియాను తీహార్ జైలుకు తరలించారు. సిసోడియాను విచారించేందుకు ఈడీ అధికారులు ఇప్పటికే కోర్టు అనుమతి తీసుకున్నారు. మంగళవారం సిసోడియాను విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు, మనీలాండరింగ్ కేసును సవాల్ చేస్తూ శరత్ చంద్రారెడ్డి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు.