శీతాకాలంలో కూడా కాశ్మీర్‌ లోయలో పర్యాటకుల సందడి

దశాబ్దాల తర్వాత అందమైన కాశ్మీర్ లోయలో పర్యాటకుల సందడి కనిపిస్తున్నది. కఠినమైన శీతాకాలంలో కూడా సుందరమైన కాశ్మీర్‌ను సందర్శించేందుకు పోటీపడుతున్నారు. ఈ సంవత్సరం మొదటి రెండు నెలల్లో రికార్డు స్థాయిలో 2.5 లక్షల మంది పర్యాటకులు కాశ్మీర్‌ లోయను సందర్శించారు.

2022 ఒక్క ఏడాదిలో కాశ్మీర్‌ను సందర్శించిన సందర్శకుల సంఖ్య 25 లక్షలకు చేరుకుంది. ఇది గత 40 ఏళ్ల సగటు కంటే గణనీయంగా ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు. ఫిబ్రవరిలో 1.2 లక్షల మందికి పైగా ప్రజలు కాశ్మీర్‌కు వెళ్లారని, వారిలో 90 శాతం మంది కాశ్మీర్‌లోని ప్రసిద్ధ గుల్‌మార్గ్ స్కీ రిసార్ట్ ను సందర్శించారని కాశ్మీర్ టూరిజం డైరెక్టర్ ఫజల్-ఉల్-హసీబ్ చెప్పారు.

టూరిజం పరంగా కాశ్మీర్‌కు 2022 ఉత్తమ సంవత్సరం అని పర్యాటక శాఖకు చెందిన ఒక ఉన్నత అధికారి తెలిపారు. “ఈ ఏడాది కాశ్మీర్ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచింది. శీతాకాలపు రిజర్వేషన్లు కూడా బాగానే ఉన్నాయి. ఈ సంవత్సరం ట్రావెల్ సీజన్ బిజీగా ఉంటుందని భావిస్తున్నాం” అని చెప్పుకొచ్చారాయన.  ఇక.. 2017లో మొత్తం 11 లక్షల మంది పర్యాటకులు కాశ్మీర్‌ను సందర్శించగా.. 2018లో కేవలం 8.5 లక్షల మంది మాత్రమే సందర్శించారని అధికారులు తెలిపారు.

బాలీవుడ్‌ కూడా కాశ్మీర్‌కు తిరిగి వచ్చింది. నటులు రణ్‌వీర్‌ సింగ్‌,, అలియా భట్‌ తమ రాబోయే చిత్రం ”రాకీ ఔర్‌ రాణి కి ప్రేమ్‌ కహానీ” కోసం మంచుతో కప్పబడిన గుల్‌మార్గ్‌లో షూట్‌లతో బిజీగా ఉన్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గుల్‌మార్గ్‌లోని స్కీ రిసార్ట్‌కి మాత్రమే కాకుండా, దక్షిణ కాశ్మీర్‌లోని పహల్గామ్‌ రిసార్ట్‌కు కూడా పర్యాటకులు పోటెత్తారు.

సాధారణంగా ఇది శీతాకాలంలో ఖాళీ ఉంటుంది. కానీ ఈ ఏడాది చెప్పుకోదగ్గ సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి రాకపోకలు సాగించారు. జనవరిలో 1.27 లక్షల మంది పర్యాటకులు కాశ్మీర్‌ను సందర్శించారు. ఫిబ్రవరిలో 1.29 లక్షల మంది వచ్చారు.  ఈ సంవత్సరం పర్యాటక సీజన్‌ బంపర్‌గా ఉంటుందని కాశ్మీర్‌ పర్యాటక అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. గత సంవత్సరం నుండి పర్యాటకుల రాక పెరిగింది. రాబోయే నెలల్లో ఈ ధోరణి కొనసాగుతుందని ఆశాభావంతో ఉన్నామని టూరిజం డైరెక్టర్ తెలిపారు.

గతేడాది ఫిబ్రవరిలో కేవలం 1,63,154 మంది పర్యాటకులు మాత్రమే లోయను సందర్శించారు. ట్రావెల్‌ ఏజెంట్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా కాశ్మీర్‌ చాప్టర్‌ ప్రెసిడెంట్‌ జహూర్‌ అహ్మద్‌ ఖారీ మాట్లాడుతూ, పర్యాటకుల రద్దీ బాగుందని, గుల్మార్గ్‌ స్కీ రిసార్ట్‌ మార్చి చివరి వరకు బుకింగ్‌లు పూర్తిచేసుకుందని తెలిపారు.

అక్టోబర్‌లో మూసివేసే హౌస్‌బోట్‌లు ఈ సంవత్సరం చలికాలంలో మంచి ఆక్యుపెన్సీని కలిగి ఉన్నాయి. మలేషియా, థాయిలాండ్‌, ఇండోనేషియా సహా ఆగ్నేయాసియా నుండి విదేశీ పర్యాటకులు కూడా ఈ సంవత్సరం మొదటి రెండు నెలల్లో కాశ్మీర్‌ను సందర్శించారని అహ్మద్‌ ఖారీ చెప్పారు.

2022- 2023 చలికాలంలో లోయలో పర్యాటకుల రద్దీ ఉందని కాశ్మీర్‌ హోటల్స్‌ అండ్‌ రెస్టారెంట్‌ ఓనర్స్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు బషీర్‌ అహ్మద్‌ భట్‌ తెలిపారు. శ్రీనగర్‌లోని హోటళ్లలో ప్రస్తుతం 70-75 శాతం ఆక్యుపెన్సీ ఉందని, ఈ ఏడాది కాశ్మీర్‌కు పూర్తి స్థాయిలో పర్యాటకుల రాకపోకలు వస్తాయని ఆశిస్తున్నామని చెప్పారు.

 శ్రీనగర్‌లో ఆసియాలోనే అతిపెద్ద తులిప్‌ గార్డెన్‌ను ప్రారంభించడంతో పర్యాటకుల రాక మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ఏడాది ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు తులిప్‌ ఫెస్టివల్‌ జరగనుంది. అంటే ఈ 20 రోజులపాటు రంగురంగుల తులిప్‌ పుష్పాలు, రకరకాల ఇతర పుష్పాలు పర్యాటకులకు కనువిందు చేయనున్నాయి.

గత సంవత్సరం, 3.65 లక్షల మంది పర్యాటకులతో సహా 2.7 మిలియన్ల మంది పర్యాటకులు లోయను సందర్శించారు. ఇదే సమయంలో బాలీవుడ్‌ కూడా సుందరమైన కాశ్మీర్‌తో మమేకం అవుతోంది. చిత్రనిర్మాతలు సినిమా షూటింగ్‌ల కోసం ఇక్కడకు బారులు తీరుతున్నారు.