ఇద్దరు గొప్ప సాధువుల మహాసమాధి వార్షికోత్సవాలు

ఎ వి నారాయణరావు
భారతదేశంలో ఇప్పటికీ సుప్రతిష్టితమై కొనసాగుతూ ఉన్న గురుశిష్య సంబంధానికి సాటియైనది ఈ సమస్త విశ్వంలో మరొకటి లేదు. ఇతరములైన మానవుల అన్ని రకాల అనుబంధాలూ, ప్రేమలూ బహుశా రక్త సంబంధం, ప్రణయం లేక స్నేహం కారణంగా ఏర్పడినవి. కానీ వీటికి విభిన్నంగా, శిష్యుడి ఆధ్యాత్మిక అభివృద్ధికోసం గురువు నిస్వార్థ తపన, ఆయన సంరక్షణలోనున్న శిష్యుని బేషరతుగా, సర్వం సమర్పించే ప్రేమపై ఆధారపడిన గురుశిష్య సంబంధం ఎంతో ప్రత్యేకమైనది.  
 
 ఒక ఋషికి, ఆయన ప్రధాన శిష్యుడికి మధ్య ఉండే మహోన్నతమైన సంబంధానికి ఒక మహిమాన్వితమైన ఉదాహరణగా నిలుస్తారు స్వామి శ్రీయుక్తేశ్వర్ గిరి, ఆయన సాటిలేని శిష్యుడు — అన్ని కాలాల్లోనూ అత్యంత ప్రఖ్యాతి గాంచిన ఆధ్యాత్మిక గ్రంథ రాజాల్లో ఒకటైన ”ఒక యోగి ఆత్మ కథ” రచయిత — శ్రీ శ్రీ పరమహంస యోగానంద.
 
ఈ ఉత్కృష్ట గ్రంథం ప్రేమతో కూడినదైనా, కఠినమైన శిక్షణతో కూడినదై భక్తుడైన ముకుందుడిని జగద్గురువు లేక విశ్వగురువైన యోగానందులుగా శ్రీయుక్తేశ్వర్ గిరి తీర్చిదిద్దిన ఆ కాలాన్ని గురించి తిరుగులేని, ప్రేరణాత్మకమైన వివరణను మనకు అందిస్తుంది.
 
ఈ ఉద్గ్రంథంలోని ఒక ముఖ్యమైన అధ్యాయం, “గురుదేవుల ఆశ్రమంలో గడిచిన కాలం”లో శ్రీయుక్తేశ్వర్ విశిష్టమైన శిక్షణా విధానం, గురువాజ్ఞపై అమెరికాకు తరలి, చివరకు పాశ్చాత్య ప్రపంచానికి యోగ పితామహుడుగా రూపొందిన యోగానందుల – మొదట్లో మానవ సహజంగా కొంత కంపించినా — పరిపూర్ణమైన, దృఢమైన విధేయతను మనకు వివరిస్తుంది.  
 
యోగానందులు 1917లో యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియాని, ఆ తరువాత అమెరికాలో వైఎస్ఎస్ కు ప్రపంచ స్థాయిలో సోదర సంస్థ అయిన సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ ను స్థాపించారు. ఈ రెండు సంస్థలూ యోగానందుల యోగ-ధ్యాన బోధనలను వ్యాప్తి చేస్తూ, ప్రపంచంలోని అన్ని నిజమైన ఆధ్యాత్మిక బోధనల ఏకత్వాన్ని బోధించడంతో పాటు భగవంతుడితో ప్రత్యక్ష సంబంధం నెలకొల్పుకోవలసిన అవసరాన్ని నొక్కి చెబుతాయి.
 
నిజమైన శ్రద్ధతో ఈ మార్గాన్ని అనుసరించడం ప్రారంభించాక తమ జీవితాలు గుర్తించదగినంతగా శ్రేష్టమైన మలుపు తిరిగిన సత్యాన్ని ఈ బోధనలను పాటించే లక్షలాది భక్తులు దృఢపరిచారు.   నిరంతరం కనిపెడుతూ, కఠినమూ, ఆంతరిక ప్రేమతో కూడినదీ అయిన శ్రీయుక్తేశ్వర్ గిరి శిక్షణలో రూపుదిద్దుకొన్న యోగానందుల జీవితంలోని అనేక సంఘటనలు “ఒక యోగి ఆత్మకథ”లో వర్ణించారు.
 
దైవ సంసర్గానికై బాల యోగానందుల తపన, తన శిష్యుడి జీవితాన్ని సుసూక్ష్మ మైన ఆధ్యాత్మిక నియమాల కనుగుణంగా రూపొందించాలన్నఆయన గురువు మరింత దృఢమైన నిశ్చయం గ్రహణశీలురైన పాఠకులకు ఈ గ్రంథంలో దర్శనమిస్తాయి.  
 
శిష్యుడు, గురువు మధ్య ఉండే సుకుమారమూ, కోమలమూ, ప్రేమమయమూ, వాటితోపాటుగా ఆవశ్యకాలైన జ్ఞానమూ, క్షమ, దివ్య ప్రేమలతో కూడిన ఆ బంధం ఈ ఇద్దరి మహోత్కృష్ట జీవితాల నిజమైన వారసత్వం. విధ్వంసకర శక్తి అయిన మాయ-భ్రాంతికి లోనై త్రివిధ క్లేశాలతో –భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక —  బాధపడే మానవులను ఉద్ధరించడానికి వీరిరువురూ తమ జీవితాలను అంకితం చేశారు.  
 
 శ్రీయుక్తేశ్వర్ గిరి, యోగానంద (దివ్య పరమ గురువులైన లాహిరి మహాశయులు, మహావతార్ బాబాజీ మార్గదర్శకత్వంతో) ప్రపంచానికి అందించిన సనాతనమైన, విశ్వజనీన కానుక అత్యున్నత శాస్త్రీయధ్యాన ప్రక్రియ అయిన క్రియాయోగం. ఇదివరకు ఈ ప్రక్రియ అనేక యుగాలపాటు దయలేని కర్మ సంబంధ శక్తుల ధాటికి గాయపడి మరుగునపడి ఉంది. 
 
యోగానందుల మహాసమాధి రోజు మార్చి 7 న కాగా, శ్రీయుక్తేశ్వర్ మహాసమాధి రోజు మార్చి 9. బహుశా ఈ పక్క పక్క రోజులు కూడా వారిరువురిమధ్య ఉన్న శాశ్వత బంధాన్ని సూచిస్తుండవచ్చు. ఇక వారి జీవితాలను పరివేష్టించిన అమూల్య లక్షణం భగవంతుడిపై ప్రేమ. అదే మనలో ప్రతి ఒక్కరూ అలవర్చుకోవలసిన ప్రేమ. 
అదనపు సమాచారం కోసం: yssi.org సందర్శించండి