ఎమ్మెల్సీ కవిత బినామీగా అరుణ్ పిళ్లై!

* కవితను విచారింపనున్న ఈడీ
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ అరెస్ట్ చేసిన హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైన ఈ మొత్తం వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బినామీగా వ్యవహరించారని పేర్కొంది. రౌస్ అవెన్యూ సీబీఐ కోర్టులో మంగళవారం హాజరుపరిచిన ఈడీ  17 పేజీలతో పిళ్లై రిమాండ్ రిపోర్టు రూపొందించి, న్యాయస్థానానికి సమర్పించింది.కాగా, ఢిల్లీ లిక్కర్ స్కాంలో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇచ్చింది. మార్చి 9న ఢిల్లీకి రావాలని నోటీసుల్లో తెలిపింది.
 
ఇందులో కీలక విషయాలను ఈడీ బయటపెట్టింది. సౌత్ గ్రూప్ మొత్తాన్ని అరుణ్ పిళ్లై దగ్గరుండి నడిపించారని పేర్కొంది. ఇందులో వైఎస్సార్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు, ఆయన కుమారుడు రాఘవ, అరబిందో ఫార్మా ప్రమోటర్ శరత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఉన్నారని ఈడీ తెలిపింది. ఈ గ్రూప్ తరపున పిళ్లై, అభిషేక్ బోయిన్ పల్లి, బుచ్చిబాబు ప్రతినిధులుగా వ్యవహరించారని వెల్లడించింది.

ఈ మొత్తం వ్యవహారంలో అరుణ్ పిళ్లై.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బినామీగా వ్యవహరించారని ఈడీ రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొంది. ఇదే విషయాన్ని విచారణలో పిళ్లై చెప్పారని వివరించింది. ఆప్ నేతలకు రూ. 100 కోట్లు ఇచ్చినట్లు దర్యాప్తులో పిళ్లై అంగీకరించారని, ఆ పెట్టుబడితో రూ. 292 కోట్లు సంపాదించారని ఈడీ పేర్కొంది. సౌత్ గ్రూప్ వ్యక్తుల సంస్థలన్నీ కలిపి రూ. 3,500 కోట్ల వ్యాపారం చేశాయని తెలిపింది.

ఇండో స్పిరిట్స్ సంస్థ భాగస్వామిగా ఉన్న పిళ్ళై మద్యం వ్యాపారంలో ఉత్పత్తిదారులు, హోల్ సేల్ వ్యాపారులు, రీటైల్ జోన్లతో కార్టెల్ రూపొందించేందుకు కీలకంగా వ్యవహరించారని ఈడీ పేర్కొంది. ఇదే కార్టెల్.. ఢిల్లీలోని 9 రీటైల్ జోన్లను దక్కించుకుందని వెల్లడించింది.

ఈ మొత్తాన్ని నడిపించేందుకు పిళ్లై ఆధ్వర్యంలో అనేక సమావేశాలు జరిగాయని, శరత్ రెడ్డి చార్టెడ్ ఫ్లైట్ లో ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు పిళ్లై, అభిషేక్ బోయన్ పల్లి, బుచ్చిబాబు సహా మరికొందరు వెళ్లారని వెల్లడించింది. వీరంతా ఢిల్లీలో సమీర్ మహేంద్రుతో సమావేశమయ్యారని తెలిపింది. ఈ స్కాంలో మొదటి నుంచి అరుణ్ పిళ్లై ముఖ్య పాత్ర పోషించారని ఈడీ రిమాండ్ రిపోర్టులో వివరించింది.

అరుణ్ పిళ్లైని ఏడు రోజుల కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరగా రౌస్ అవెన్యూ సీబీఐ కోర్టు సమ్మతించింది. దీంతో ఆయన మార్చి 13వ తేదీ వరకు ఈడీ కస్డడీలో ఉండనున్నారు. కస్టడీలో ఉన్న సమయంలో తన తల్లితో ఫోన్ లో మాట్లాడేందుకు కోర్టు అనుమతించింది. ప్రతి రోజు తన భార్య, బావ మరిదిని కలుసుకునేందుకు వెసులుబాటు కల్పించింది.

అనారోగ్యంతో బాధపడుతున్న పిళ్లైకి పైపోథైరాయిడ్ మందులు, వెన్ను నొప్పి బెల్ట్ ను కస్టడీలో ఉపయోగించుకోవచ్చని స్పష్టం చేసింది. పిళ్లైని కెమెరా ముందు మాత్రమే ప్రశ్నించాలని, దర్యాప్తుని రికార్డ్ చేయాలని ఆదేశించింది.

 

ఢిల్లీ లిక్కర్ స్కాంలో 14వ నిందితుడిగా అరుణ్ రామచంద్ర పిళ్లై ఉన్నారు. ఈ కుంభకోణానికి సంబంధించిన కేసులో ఇప్పటికే 11 మంది అరెస్టయ్యారు. ఇదే కేసులో ఆప్ నేత మనీశ్ సిసోడియాకు సీబీఐ ప్రత్యేక కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాలతో ఆయనను తీహార్ జైలుకి తరలించారు.

సిసోడియా వారం రోజులుగా సీబీఐ కస్టడీలో ఉన్నారు. ఈడీ కేసులో అరెస్టయిన మరో ఆప్ నేత సత్యేంద్ర జైన్ తో పాటు లిక్కర్ స్కాంలో అరెస్టయిన ఏడుగురు నిందితులు కూడా ప్రస్తుతం తీహార్ జైలులోనే ఉన్నారు.