తగ్గుతున్న నిరుద్యోగం.. పెరుగుతున్న వ్యవసాయం వాటా

2018-19లో 5.8 శాతంగా ఉన్న నిరుద్యోగం రేటు 2021-22లో 4.1 శాతానికి పడిపోయినట్లు పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే (పిఎల్‌ఎఫ్‌ఎస్‌) వార్షిక నివేదిక పేర్కొంది. అదే సమయంలో మొత్తం ఉపాధిలో వ్యవసాయం వాటా పెరిగిందని తెలిపింది.  2028-19లో 42.5 శాతంగా ఉన్న వ్యవసాయం వాటా 2021-22లో 45.5 శాతానికి పెరిగినట్లు తెలిపింది.

కరోనా మహమ్మారి ప్రభావం దేశ జనాభాలో కొంత భాగాన్ని ఇప్పటికీ దెబ్బతీస్తుందని ఈ సర్వే వెల్లడించింది. పిఎల్‌ఎఫ్‌ఎస్‌ సర్వే ప్రకారం గ్రామీణ జనాభా వాటాను అనుసరించి 2021-22లో కూడా గ్రామీణ ప్రాంతాల్లో చెల్లించని స్వయం ఉపాధి పొందుతున్న వారి వాటా పెరుగుతూనే ఉంది.  2004-05 నుండి 2011-12 మధ్య 58.5 శాతం నుండి 48.9 శాతం వ్యవసాయ కార్మికులలో అత్యధిక క్షీణత నమోదైందని పేర్కొంది. 2011-12లో తయారీ రంగంలో పనిచేస్తున్న శ్రామిక శక్తి వాటా 12.6 శాతానికి చేరుకుందని నివేదిక పేర్కొంది.

2018 తర్వాత ఉపాధిలో వ్యవసాయం వాటా పెరిగిందని తెలిపింది. ఉపాధిలో తయారీ రంగం వాటా 2018-19లో 12.1 శాతం ఉండగా, 2021-22లో 11.6 శాతంగా ఉన్నట్లు తెలిపింది. వ్యవసాయ రంగం నుండి అధిక శాతం మంది నిర్మాణ రంగం వైపు మరలగా, రెండూ కూడా తయారీ రంగాన్ని అధిగమించాయి.

స్వయం ఉపాధి పొందే వారి వాటా 2018-19లో 52.1 శాతం ఉండగా, 2021-22లో 55.8 శాతానికి పెరిగిందని నివేదిక వెల్లడించింది. ఐదేళ్ల క్రితం వరకు వ్యవసాయ రంగం తర్వాత తయారీ రంగం రెండవ అతిపెద్ద ఉపాధి అవకాశాలను కల్పించేదని, కానీ ప్రస్తుతం నిర్మాణ రంగం రెండో స్థానాన్ని భర్తీ చేయడంతో తయారీ రంగం నాలుగో స్థానానికి పడిపోయిందని తెలిపింది.

అదే సమయంలో వారు  పొందే రోజువారీ వేతనం, జీతం వాటా 23.8 శాతం నుండి 21.5 శాతానికి పడిపోయిందని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో ఆధార పడే వారి నిష్పత్తి వేగంగా పెరుగుతుండటంతో ఉద్యోగులపై మరింత ఒత్తిడి తీసుకువస్తోందని పేర్కొంది.