మరోసారి త్రిపుర సీఎంగా మాణిక్ సాహా

త్రిపుర ముఖ్యమంత్రిగా మాణిక్ సాహా రెండోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. సోమవారం జరిగిన శాసనసభ పక్ష సమావేశంలో ఆయనను తమ నేతగా ఎమ్మెల్యేలు  ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి సాహా వెంటనే త్రిపుర గవర్నర్‌ను కలిసి సంసిద్దతను వ్యక్తం చేశారు.

దీంతో రెండోసారి మాణిక్ సాహా  త్రిపుర సీఎం పీఠాన్ని అదిష్టించనున్నారు. మార్చి 8న సాహా  ప్రమాణస్వీకారం ఉండనుంది. కేబినెట్ మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా మార్చి 8న జరగనుంది.  ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ,  కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా  పాల్గొననున్నారు.

ఇటీవల ముగిసిన రాష్ట్ర ఎన్నికలలో, 60 మంది సభ్యుల అసెంబ్లీలో బిజెపి 32 స్థానాలను గెలుచుకుంది. బీజేపీ మిత్రపక్షమైన ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపీఎఫ్‌టీ) ఒక స్థానాన్ని గెలుచుకుంది.  ఆదివాసీలకు చెందిన తిప్రా మోత పార్టీ తొలిరోజు 42 స్థానాల్లో పోటీ చేసి 13 స్థానాలు సాధించి రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది.  సీపీఎం 11 స్థానాల్లో గెలుపొందగా, కాంగ్రెస్‌ మూడు స్థానాల్లో విజయం సాధించింది.

2016లో కాంగ్రెస్ ను వదిలి బీజేపీలో చేరిన  మాణిక్ సాహాను  త్రిపుర ఎన్నికలకు 10 నెలల ముందు ముఖ్యమంత్రిగా నియమిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అంతకుముందు బిప్లబ్ కుమార్ దేబ్ సీఎంగా ఉన్నారు.  ఏక్ త్రిపుర, శ్రేష్ఠ్ త్రిపుర నినాదాన్ని మాణిక్ విస్తృతంగా ప్రచారం చేశారు.

టౌన్ బర్దోవాలీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మాణిక్ సాహా గెలిచారు. ఊహించిన విజయాన్ని సాధించామని ఫలితాల తర్వాత ఆయన చెప్పారు. “బీజేపీ విజయం ఊహించినదే. కాకపోతే మేం ఆసక్తిగా ఎదురు చూశాం అంతే. ఇప్పుడు మా బాధ్యత మరింత పెరిగింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చూపిన దారిలో మేం ముందుకు సాగుతాం” అని మాణిక్ సాహా తెలిపారు.