ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్ట్ అంటూ ఇంటివద్ద హైడ్రామా

తోషాఖానా కేసులో పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ను అరెస్టు చేసేందుకు ఆయన ఇంటివద్దకు పెద్ద సంఖ్యలో పోలీసులు చేరుకోవడంతో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో ఇమ్రాన్‌ఖాన్‌పై ఇప్పటికే వారెంట్‌ జారీ కావడంతో అరెస్టు చేసేందుకు ఇస్లామాబాద్‌ పోలీసులు ఆయన ఇంటికి చేరుకున్నారు.
 
ఆ సమయంలో ఇమ్రాన్‌ ఇంట్లో లేనట్లుగా పాక్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరో వైపు ఇవాళ ఇమ్రాన్‌ అరెస్టు చేయనున్నట్లు ఇస్లామాబాద్‌ ఐజీ సైతం ప్రకటించారు. అరెస్టు వార్తల నేపథ్యంలో పీటీఐ చీఫ్‌ మద్దతుదారులు పెద్ద ఎత్తున ఆయన ఇంటికి చేరుకున్నారు. ఇమ్రాన్ మద్దతుదారుల నినాదులు, నిరసనలతో పోలీసులు ముందుకు వెళ్లలేకపోయారని వార్తలు వచ్చాయి.
 
కాగా, అతికష్టం మీద ఇమ్రాన్ నివాసంలోకి ఒక సీనియర్ అధికారి అడుగుపెట్టారని, అయితే అక్కడ ఇమ్రాన్ జాడ కనిపించలేదని పోలీసు వర్గాల సమాచారం. అరెస్టు నుంచి తప్పించుకునే క్రమంలోనే ఆయన తన నివాసానికి దూరంగా ఉన్నారని వారు అనుమానిస్తున్నారు. కోర్టు ఉత్తర్వుల మేరకే తాము లాహోర్ వచ్చామని, ఆయనను తమ ప్రొటక్షన్ లోకి తీసుకునేందుకు ఇస్లామాబాద్ తరలిస్తామని ఇస్లామాబాద్ పోలీసులు ఒక ట్వీట్‌లో తెలిపారు. కోర్టు ఉత్తర్వులు అమలు కానీయకుండా అడ్డుకునే వారిపై లీగల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
 
మరోవైపు, ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకున్నా దేశ పరిస్థితి మరింత మరోవైపు, ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకున్నా దేశ పరిస్థితి మరింత విషమిస్తుందని పాకిస్థాన్ మాజీ మంత్రి ఫవద్ చౌదరి… షెహబాజ్ షరీప్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వాస్తవానికి తోషాఖానా కేసు విచారణ కోసం ఇమ్రాన్‌ కోర్టుకు హాజరుకావాల్సి ఉండగా.. పట్టించుకోకపోవడంతో ఇమ్రాన్‌ను అరెస్టు చేయాలని కోర్టు ఆదేశించింది. ఫిబ్రవరి 28న నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను అడిషనల్ సెషన్స్ జడ్జి జారీ చేశారు.
 
ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో దేశ విదేశాలలో సేకరించిన ఖరీదైన వస్తువులు, కానుకలను నిబంధనల ప్రకారం తోషఖానాను తరలించారు. అవే వస్తువులను తోషఖానా నుంచి తక్కువ ధరకు కొనేసి, ఎక్కువ ధరకు అమ్ముకుని ఆయన సొమ్ము చేసుకున్నట్టు ఆరోపణలున్నాయి. ప్రస్తుతం తోషఖానా కేసుపై కోర్టులో విచారణ జరుగుతోంది.