మంత్రి గుమ్మనూరు జయరాం ఆస్తుల జప్తు

ఆంధ‌రప్రదేశ్‌ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్‌ ఆదాయ పన్ను శాఖ చిక్కుల్లో ఇరుక్కున్నారు. జయరాంకు చెందిన బినామీ ఆస్తుల జప్తు ప్రక్రియను కొనసాగిస్తున్నట్లు ఆదాయ పన్ను శాఖ తాజాగా ప్రకటించింది.   మంత్రి గుమ్మనూరు జయారం బినామీ లావాదేవీలతో బంధువులు, సన్నిహితుల పేర్లపై ఆస్తులు కూడబెట్టారనే, ఆరోపణల నేపథ్యంలో ఆదాయపన్ను శాఖలోని బినామీ ఆస్తుల నిరోధక విభాగం ఇప్పటికే కేసు నమోదు చేసింది.
 
కేసు విచారణలో భాగంగా మంత్రికి చెందిన పలు ఆస్తులను ప్రాథమికంగా జప్తు చేస్తూ, ప్రొవిజనల్‌ ఎటాచ్‌మెంట్‌ ఉత్తర్వులు జారీ చేశారు. గతేడాది డిసెంబరులో జయరామ్‌ భార్య రేణుకకు చెందిన 30 ఎకరాలకు లావాదేవీలు అనుమానస్పదంగా ఉండంటతో వాటిపై వివరన ఇవ్వాలని నోటీసులను ఇచ్చిన ఐటీ శాఖ ఆ తర్వాత వాటిని జప్తు చేసింది. తాజాగా మరో 90 ఎకరాలను జప్తు చేసింది.

బెంగళూరుకు చెందిన రియల్‌ఎస్టేట్‌ సంస్థ ‘ఇట్టినా ప్లాంటేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ చాలా కాలం క్రితం కర్నూలు జిల్లా ఆలూరు పరిధిలోని చిన్నహోతూరు, పెద్ద హోతూరు, ఆస్పరి పరిసరాల్లో రైతుల నుంచి 454.37 ఎకరాలను కొనుగోలు చేసింది. ఈ కంపెనీ డైరెక్టర్లు ఇట్టినా మను, మోనాలకు వరుసకు చిన్నాన్న అయ్యే మంజునాథ్‌ ఈ భూముల విక్రయాన్ని ప్రారంభించారు.

మంజునాథ్‌ వద్ద భూములు కొన్నవారిలో మంత్రి భార్యతో పాటు కుటుంబీకులు, సన్నిహితులు ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. మంత్రి జయరామ్‌ మొత్తం 180 ఎకరాలు ఇట్టినా సంస్థ నుంచి కొన్నట్లు అనుమానాలు ఉన్నాయి. మంత్రికి భూములమ్మిన మంజునాథ్‌కు తమ సంస్థతో ఎలాంటి సంబంధం లేదని, వాటి విక్రయం చెల్లదంటూ ఇట్టినా సంస్థ డైరెక్టర్లు మను, మోనాలు బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ వ్యవహారంపై ఆదాయపన్ను శాఖలోని బినామీ ఆస్తుల నిరోధక విభాగం కేసు నమోదు చేసింది. డిసెంబరులో 30 ఎకరాలను జప్తు చేశారు. గత ఫిబ్రవరిలో మరో 90 ఎకరాలను ప్రాథమికంగా జప్తు చేశారు. కర్ణాటకలోని బళ్లారికి చెందిన కరణం శ్రీదేవి పేరుతో ఉన్న 12.76 ఎకరాలు, కరణం అనంత పద్మనాభరావు పేరుతో ఉన్న 31.32 ఎకరాలు, ఉమాదేవి పేరుతో ఉన్న 30 ఎకరాల భూములు ఉన్నాయి. ఈ మూడు ఆస్తులు ఆస్పరి గ్రామంలో ఉన్నాయి.

అనంత పద్మనాభరావు పేరుతో చిన్నహోతూరులో ఉన్న మరో 16.75 ఎకరాలనూ కూడా ఐటీ అధికారులు జప్తు చేశారు. వీరంతా మంత్రి గుమ్మనూరు జయరామ్‌ బినామీలుగా అధికారులు భావిస్తున్నారు. ఆస్తుల జప్తుపై అభ్యంతరాలేమైనా ఉంటే ఈ నెల 17లోపు వివరణ ఇవ్వాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. మరోవైపు భూములను చట్టబద్దంగానే తాను కొనుగోలు చేశానని గుమ్మనూరు జయరాం చెబుతున్నారు.