ఎన్నికల కమిషనర్ల నియామకానికి త్రిసభ్య కమిటీ

ఎన్నికల కమిషనర్ల నియామకం కోసం ప్రధాన మంత్రి, ప్రతిపక్ష నాయకుడు(ఎల్‌ఓపి), భారత ప్రధాన న్యామూర్ తి(సిజెఐ)లతో కూడిన కమిటీ ఏర్పాటుకు సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది. ఇందుకు సంబంధించి పార్లమెంట్‌లో చట్టం చేసేవరకు ఈ కమిటీ అమలులో ఉండాలని జస్టిస్ కెంఎ జోసెఫ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఆదేశించింది.

ఎన్నికల కమిషన్ ప్రభుత్వ పరిధిలోకి కాకుండా స్వతంత్రంగా ఉండాలని, స్వతంత్రంగా పనిచేసేందుకు అనుకూలమైన పరిస్థితులు ఉండాలని ధర్మాసనం స్పష్టం చేసింది.  ఎన్నికల కమిషనర్లు, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ల నియామకానికి కొలీజియం తరహా వ్యవస్థను ఏర్పాటు చేయాలంటూ భారత ఎన్నికల సంఘం సభ్యుల నియామక ప్రక్రియలో సంస్కరణలు కోరుతూ దాఖలైన పలు పిటిషన్లపై ధర్మాసన  జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. 

కమిషన్ స్వేచ్ఛగా, నిజాయితీగా, చట్టబద్ధంగా వ్యవహరించాల్సి ఉంటుందని, రాజ్యాంగ నిబంధనలకు లోబడి ఉండాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు ఉద్ఘాటించింది. ప్రజస్వామ్యంలో ప్రజలకే అధికారముంటుందని, ఎన్నికల కమిషన్ స్వేచ్ఛగా, స్వతంత్రంగా వ్యవహరిస్తేనే సామాన్య ప్రజల చేతుల్లోనే ప్రజాస్వామ్య ప్రక్రియ శాంతియుతంగా మనగలుగుతుందని ధర్మాసనం పేర్కొంది.

ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల సరళి స్వచ్ఛంగా లేకపోతే అది వినాశకరమైన పరిణామాలకు దారి తీస్తుందని అభిప్రాయపడింది. ఎన్నికల కమిషన్‌ న్యాయబద్ధంగా వ్యవహరించాలని సూచించింది. ఎన్నికల అధికారిని రాజకీయ పార్టీల ప్రభావం నుంచి దూరంగా ఉంచాలని, అప్పుడే వారు స్వతంత్రంగా వ్యవహరించగలరని వ్యాఖ్యానించింది.

కేంద్ర ఎన్నికల సంఘం స్వతంత్రంగా పనిచేయాలంటే.. ప్రధాన ఎన్నికల అధికారి నియామకం కోసం ఏర్పాటు చేసే కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తిని కూడా చేర్చాలని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. “ఎన్నికలు నిస్పక్షపాతంగా జరగాలి. మా ఆదేశాలతో ఎన్నికల్లో స్వచ్ఛత మెరుగుపడుతుందని ఆశిస్తున్నాము” అని ధర్మాసనం తెలిపింది.