భారత్ కూల్చిన పాక్ డ్రోన్లు చైనావే!

పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో గత ఏడాది కూల్చివేసిన పాకిస్థాన్‌ డ్రోన్ చైనా నుంచి వచ్చిందని బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌) తెలిపింది. కూల్చివేతకు ముందు ఆ డ్రోన్‌ చైనా ప్రాంతంలో ఎగిరినట్లు ఫోరెన్సిక్ విశ్లేషణలో తేలిందని బీఎస్‌ఎఫ్‌ అధికారి ఒకరు వెల్లడించారు.  గత ఏడాది డిసెంబర్‌ 25న ఒక డ్రోన్‌ పాకిస్థాన్‌ నుంచి సరిహద్దులు దాటి అమృత్‌సర్‌లోని రాజతాల్ ప్రాంతంలోకి రావడంతో భద్రతా దళాలు కూల్చివేశాయి.
అనంతరం కూలిన డ్రోన్‌ శిథిలాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి విశ్లేషించారు. చైనా, పాకిస్థాన్‌ ప్రాంతాల్లో ఆ డ్రోన్‌ తిరిగినట్లు నిర్ధారించారు.  2022 జూలై 11న చైనాలోని ఫెంగ్ జియాన్ జిల్లా షాంఘైలో ఆ డ్రోన్‌ ఎగిరినట్లు ఫోరెన్సిక్ విశ్లేషణలో తెలిసింది. ఆ తర్వాత గత ఏడాది సెప్టెంబర్ 24 నుంచి డిసెంబర్‌ 25 మధ్య పాకిస్థాన్‌లోని ఖనేవాల్‌ ప్రాంతంలో ఆ డ్రోన్‌ 28 సార్లు తిరిగింది. బీఎస్‌ఎఫ్‌ అధికారి ఒకరు ఈ విషయాన్ని బుధవారం వెల్లడించారు.

కాగా, 2019 నుంచి పాకిస్థాన్‌ డ్రోన్లను ఎక్కువగా వినియోగిస్తున్నది. వాటి ద్వారా డ్రగ్స్‌, ఆయుధాలను అక్రమంగా భారత్‌ సరిహద్దు ప్రాంతాల్లోకి చేరవేస్తున్నది. అయితే పాకిస్థాన్‌ వైపు నుంచి భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించే డ్రోన్లను చాలాసార్లు భద్రతా సిబ్బంది కూల్చివేశారు.  కూలిన డ్రోన్ల నుంచి సాధారణంగా హెరాయిన్‌ ప్యాకెట్లను స్వాధీనం చేసుకునేవారు. అయితే కొన్ని సందర్భాల్లో పిస్టల్స్‌వంటి ఆయుధాలు కూడా  కూలిన డ్రోన్ల వద్ద లభించేవి.

మరోవైపు పంజాబ్‌తోపాటు రాజస్థాన్‌ సరిహద్దు ప్రాంతాల్లో కూడా పాకిస్థాన్‌ డ్రోన్లను భద్రతా సిబ్బంది గుర్తించారు. గత ఏడాది 22 డ్రోన్లను కూల్చివేశారు. ఈ ఏడాది గత రెండు వారాల్లో ఎనిమిది డ్రోన్లను కూల్చారు. పాకిస్థాన్‌ నుంచి వచ్చే డ్రోన్ల సంఖ్య పెరుగుతుండటంతో వాటిపై పత్యేకంగా నిఘా ఉంచారు.  కాగా, కూల్చిన డ్రోన్లు చైనాలో తయారైనట్లుగా, వాటికి వినియోగించిన బ్యాటరీలు పాకిస్థాన్‌లోని కరాచీ కంపెనీలో తయారైనట్లుగా భద్రతా సిబ్బంది గుర్తించారు.