యుపిలో గ్యాంగ్‌స్టర్‌ అనుచరుడి ఇల్లు కూల్చివేత

ఉత్తరప్రదేశ్‌ అధికారులు మరోసారి బుల్డోజర్‌కు పని చేప్పారు. గ్యాంగ్‌స్టర్‌ అనుచరుడి ఇల్లును కూల్చివేశారు. యూపీలోని ప్రయోగ్‌రాజ్‌లో ఈ సంఘటన జరిగింది. 2005లో జరిగిన బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్‌ హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి అయిన ఉమేష్‌ పాల్‌ను శుక్రవారం పట్టపగలు ఆయన ఇంటి వద్ద కొందరు దుండగులు కాల్పులు జరిపి హత్య చేశారు.
 
ప్రస్తుతం గుజరాత్‌లోని సబర్మతి జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్‌, మాజీ ఎంపీ అతిక్‌ అహ్మద్‌ ఈ హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.  ఈ నేపథ్యంలో ఉమేష్‌ పాల్‌ హత్య కేసులో నిందితుడైన అతిక్‌ అహ్మద్‌ అనుచరుడు ఖలీద్ జాఫర్‌పై ప్రయాగ్‌రాజ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీడీఏ) అధికారులు చర్యలు చేపట్టారు.
 

కరేలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని చకియా ప్రాంతంలో ఉన్న అతడి ఇంటిని బుల్డోజర్‌తో బుధవారం కూల్చివేశారు. రూ. 2.5 కోట్ల విలువైన ఈ భవనం అక్రమ నిర్మాణంగా పేర్కొంటూ ఇటీవల నోటీసులు జారీ చేశారు.కాగా, ఉమేష్‌ పాల్‌పై కాల్పులు జరిపిన వ్యక్తులను కారులో తరలించిన అర్బాజ్‌ను పోలీసులు సోమవారం ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపారు. అలాగే ఈ కేసులో మరో నిందితుడైన సదాఖత్ ఖాన్, మరో వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. సదాఖత్‌ ఖాన్‌కు 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీ విధించారు. మరోవైపు గ్యాంగ్‌స్టర్‌ అనుచరుడి బిల్డింగ్‌ను బుల్డోజర్‌తో కూల్చివేసిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

ఇదిలావుండగా, ప్రయాగ్‌రాజ్ డెవలప్‌మెంట్ అథారిటీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఇంటిని చట్టవిరుద్ధంగా నిర్మించినట్లు తెలుస్తోంది. దీని కూల్చివేతకు గతంలోనే నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. పీడీఏ వైస్ చైర్మన్ అరవింద్ కుమార్ చౌహాన్ మాట్లాడుతూ, ఈ ఇంటిని నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని తెలిపారు. అందుకే దీనిని కూల్చేస్తున్నామన్నారు. చట్ట ప్రకారం అవసరమైన అన్ని పద్ధతులను పాటించినట్లు తెలిపారు. ఈ ఇంటి యజమానికి ముందుగానే నోటీసు ఇచ్చామని చెప్పారు.