ముంబైలో ప్రవేశించిన కరడుగట్టిన ఉగ్రవాది

ముంబైలోకి కరుడుగట్టిన ఉగ్రవాది ప్రవేశించాడు. నగరంలో భారీ విధ్వంసానికి అతను స్కెచ్‌ వేసినట్లు సమాచారం. ఇంటెలిజెన్స్‌ వర్గాల ద్వారా విషయం తెలుసుకున్న ఎన్‌ఐఏ అధికారులు అప్రమత్తమయ్యారు. హైస్పీడ్‌లో టెర్రరిస్ట్‌ను ట్రాక్‌ చేయాలని, లేదంటే పెను ప్రమాదం తప్పదని ముంబై పోలీసులను హెచ్చరించారు.
దీంతో మహారాష్ట్రకు చెందిన యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌, ముంబై పోలీసులతో కలిసి నగరమంతా గాలిస్తున్నారు.  ముంబైలోకి ప్రవేశించిన ఉగ్రవాదిని సర్ఫరాజ్‌ మెమోన్‌ అని ఎన్‌ఐఏ అధికారులు గుర్తించారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన వ్యక్తి అని తెలిపారు. అతను చైనాతో పాటు పాకిస్థాన్‌, హాంకాంగ్‌లో శిక్షణ తీసుకుని చాలా ప్రమాదకరంగా మారాడని ముంబై పోలీసులను ఎన్‌ఐఏ హెచ్చరించింది.
 
ఉగ్రవాదికి సంబంధించిన ఫొటోలతో పాటు ఆధార్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాస్‌పోర్ట్‌, వంటి ఇతర వివరాలను పోలీసులకు మెయిల్‌ చేసింది. వీలైనంత తొందరగా అతడిని పట్టుకోవాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే ముంబై నగరమంతా సర్ఫరాజ్‌ కోసం జల్లెడ పడుతున్నారు.  దీంతో పాటు గతంలో అరెస్టయిన ఉగ్రవాదులను కూడా విచారిస్తున్నారు. కాగా, ముంబై నగరంలో ఉగ్రదాడికి ప్లాన్‌ చేసినట్లు ఈ నెల మొదట్లో ఎన్‌ఐఏకు ఒక మెయిల్‌ వచ్చింది. ఆ మెయిల్‌ పంపిన వ్యక్తి తాలిబన్‌ సభ్యుడిని అని పేర్కొనడం గమనార్హం.