అదానీ షేర్ల పతనంపై `సుప్రీం’ నిపుణుల కమిటీ ఏర్పాటు

హిండెన్‌బర్గ్ రిసెర్చ్ నివేదిక నేపథ్యంలో సెబీ నిబంధనల్లోని సెక్షన్ 19 ఉల్లంఘనలు జరిగాయా, ప్రస్తుత చట్టాలకు విరుద్ధంగా స్టాక్ ధరలకు సంబంధించి అవకతవకలు జరిగాయా అన్న విషయాలపై దర్యాప్తు చేయాలని స్టాక్ మార్కెట్ నియంత్రణా సస్థ సెబీని సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది.

జనవరి 24న వెలువడిన హిండెన్‌బర్గ్ నివేదికలో పేర్కొన్న ఆరోపణలపై ఇప్పటికే సెబీ దర్యాప్తు చేస్తోందన్న విషయాన్ని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. ప్రస్తుత దర్యాప్తు పరిధిపై తాము ఎటువంటి ఆదేశాలు జారీచేయడంలేదని, రెండు నెలల్లో సెబీ తన దర్యాప్తు నివేదికను అందచేయాలని ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఆదేశించింది.

హిడెన్‌బర్గ్ నివేదిక విడుదలైన దరిమిలా అదానీ గ్రూపు షేర్ల ధరలు హఠాత్తుగా పతనమైన దృష్టా ఇన్వెస్టర్ల ప్రయోజనాలను పరిరక్షించడానికి తగిన సూచలు చేపేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎఎం సప్రే సారథ్యంలో ఒక నిపుణుల కమిటీని నియమిస్తున్నట్లు త్రిసభ్య ధర్మాసనం ప్రకటించింది.

ఈ నిపుణుల కమిటీలో ఓపి భట్, స్టిస్(రిటైర్డ్) జెపి దేవ్‌దత్, నందన్ నీలేకని, కెవి కామత్, సోమశేఖరన్ సెందరసన్ ఉన్నారు. నిపుణుల కమిటీ సీల్డ్ కవర్‌లో తన నివేదికను రెండు నెలల్లో సమర్పించాలని కూడా ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్‌, జస్టిస్‌ పి.ఎస్‌. నరసింహా, జస్టిస్‌ జె.బి. పార్దివాలాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది.

హిండెన్‌బర్గ్ నివేదిక నేపథ్యంలో ఇన్వెస్టర్ల ప్రయోజనాలను కాపాడేందుకు ఒక కమిటీని నియమించాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. మొత్తం నాలుగు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి.

కాగా, అదానీ-హిండెన్‌బర్గ్ వివాదాన్ని దర్యాప్తు చేసేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎఎం సప్రే సారథ్యంలో ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని అదానీ గ్రూపుచైర్మన్ గౌతమ్ అదానీ స్వాగతించారు. నిర్ణీత కాల వ్యవధిలో సుప్రీంకోర్టు ఈ వివాదానికి ముగింపు పలకగలదని గౌతమ్ అదానీ ఆశాభావం వ్యక్తం చేశారు. సత్యం గెలుస్తుందంటూ ఆయన ట్వీట్ చేశారు. ఇక సుప్రీం కోర్టు తీర్పు తర్వాత అదానీ స్టాక్స్ లాభాల్లోకి మళ్లాయి. దాదాపు చాలా వరకు కంపెనీలు అప్పర్‌సర్క్యూట్‌లో ఉన్నాయి. వరుసగా మూడో సెషన్‌లో అదానీ గ్రూప్ షేర్లన్నీ లాభాల్లో కదలాడుతుండటం విశేషం.

జనవరి 24న గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్‌పై సంచలన ఆరోపణలు చేస్తూ.. ఒక రిపోర్ట్ విడుదల చేసింది అమెరికా షార్ట్ సెల్లింగ్ కంపెనీ హిండెన్‌బర్గ్. అదానీ కృత్రిమంగా షేరు విలువను పెంచినట్లు, అకౌంటింగ్ మోసాలు చేస్తున్నట్లు ఆరోపించింది. దీంతో అప్పటినుంచి గ్రూప్ షేర్లు కుప్పకూలాయి. ఏకంగా రూ.12 లక్షల కోట్లకుపైగా మార్కెట్ విలువ కూడా పతనమైంది. ఇక ఇన్వెస్టర్లలో తిరిగి విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఎఫ్ పి ఓను కూడా రద్దు చేసుకున్నారు. తర్వాత.. అప్పులు తిరిగి చెల్లిస్తానని చెప్పుకొచ్చారు.

ఇదే సమయంలో అదానీ- హిండెన్‌బర్గ్ వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరింది. అదానీ స్టాక్స్ పతనంతో.. ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయారని, దీనిపై మార్కెట్ నియంత్రణ చర్యల్ని బలోపేతం చేసేలా ఆదేశించాలని కోరుతూ పిటిషన్లు దాఖలు కాగా దానిపై కోర్టు విచారణ చేస్తోంది. మరోవంక, అదానీ గ్రూప్​పై జేపీసీ నియమించాలని ప్రభుత్వంపై విపక్షాలు ఒత్తిడి చేశాయి. దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాయి.