సిపిఆర్‌కు ఎఫ్‌సిఆర్‌ఎ లైసెన్స్‌ రద్దు

దేశరాజధాని ఢిల్లీకి చెందిన మేథో సంస్థ సెంటర్‌ ఫర్‌ పాలసీ రీసెర్చ్‌ (సిపిఆర్‌)కు విదేశీ విరాళాలు (నియంత్రణ) చట్టం (ఎఫ్‌సిఆర్‌ఎ) లైసెన్స్‌ను 180 రోజుల వరకూ కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. సిపిఆర్‌కు ఎఫ్‌సిఆర్‌ఎ లైసెన్స్‌ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సోమవారం నుంచి రద్దు చేసినట్లు ఆ శాఖకు చెందిన సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు.
 
ఎఫ్‌సిఆర్‌ఎలో ప్రధాన నిబంధనను సిపిఆర్‌ ఉల్లంఘించినట్లు వెల్లడికావడంతో లైసెన్స్‌ను రద్దు చేసినట్లు చెప్పారు. గత ఏడాది సెప్టెంబర్‌ 7న సిపిఆర్‌ కార్యాలయంపై ఆదాయపన్ను శాఖ దాడులు చేసింది. విదేశీ విరాళాలు సేకరించడానికి ఎఫ్‌సిఆర్‌ఎ లైసెన్స్‌ తప్పనిసరి. దీనిని రద్దు చేస్తే విదేశాల నుంచి కొత్తగా విరాళాలు సేకరించడానికి వీలు కాదు.
 
ఇప్పటికే మిగిలి ఉన్న విదేశీ విరాళాలను హోం మంత్రిత్వ శాఖ అనుమతి లేకుండా వినియోగించుకోవడానికి వీలు కాదు. సిపిఆర్‌ను 1973లో స్థాపించారు. కేంద్ర పర్యావరణ, అటవీ, గ్రామీణ అభివృద్ధి, జల్‌ శక్తి తదితర మంత్రిత్వ శాఖలతో కలిసి పని చేసింది.  అలాగే ఆంధ్రప్రదేశ్‌, ఒడిషా, పంజాబ్‌, తమిళనాడు, రాజస్థాన్‌ వంటి రాష్ట్రాలతోనూ కలిసి పనిచేసింది. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌, మాజీ సిజెఐ వైవి చంద్రచూడ్‌ వంటి ప్రముఖులు సిపిఆర్‌ గవరిుంగ్‌ బోర్డులో సభ్యులుగా గతంలో పనిచేశారు.