మందగమనంలో ప్రపంచ వృద్ధి

 
పలు దేశాల కేంద్ర బ్యాంకులు కఠినతరం చేస్తున్న ద్రవ్య పాలసీల కారణంగా 2023లో ప్రపంచ వృద్ధి మందగమనంలో కొనసాగుతుందని మూడీస్‌ అంచనావేసింది. ద్రవ్య పాలసీలను కఠినతరం చేయడంతో ఆర్థిక కార్యకలాపాలు, ఉపాధిపై ప్రభావం తీవ్రంగా ఉంటుందని తెలిపింది. ‘గ్లోబల్‌ ఎకనామిక్‌ రిస్క్స్‌ ప్రెసిస్ట్‌ డిస్పైట్‌ రీసెంట్‌ పాజిటివ్‌ సర్‌ప్రైజెస్‌’ పేరుతో మూడీస్‌ నివేదికను విడుదల చేసింది.
జి20 ప్రపంచ ఆర్థిక వృద్ధి 2022లో 2.7 శాతం నుండి 2023లో 2.0 శాతానికి తగ్గుతుందని, 2024లో 2.4 శాతానికి మెరుగుపడుతుందని అంచనా వేస్తున్నామని నివేదికలో పేర్కొంది.  ద్రవ్యోల్బణం సాధారణంగా కొనసాగుతుందని, అయితే కేంద్ర బ్యాంకుల లక్ష్యాలతో క్షీణత కొనసాగవచ్చని అంచనా వేసింది.
ఉదాహరణకు అమెరికాలో ద్రవ్యోల్బణం డిసెంబర్‌లో 6.5 శాతం నుండి జనవరిలో 6.4 శాతానికి, అంతకు ముందు నెలలో 7.1 శాతానికి తగ్గించబడిందని.. అయితే ఇప్పటికీ ఉద్దేశించిన లక్ష్యం 2 శాతం కన్నా ఎక్కువగా ఉందని పేర్కొంది.  అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ పాలసీ రేటు ఇప్పుడు 4.50-4.75 శాతం లక్ష్య పరిధిలో ఉందని, ఇది 15 ఏళ్లలో అత్యధిక స్థాయి అని పేర్కొంది.
అయితే గతేడాది ప్రారంభంలో ఇది సున్నాకి దగ్గరగా ఉందని తెలిపింది. వడ్డీ రేట్లను పెంచడం అనేది ద్రవ్యవిధాన సాధనం. ఇది సాధారణంగా ఆర్థిక వ్యవస్థలో డిమాండ్‌ను అణచివేయడంలో సహాయపడుతుంది. తద్వారా ద్రవ్యోల్బణం రేటు తగ్గుదలకు సహాయపడుతుంది.