వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డికి మళ్లీ నోటీసులు

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి సీబీఐ బుధవారం మరోమారు నోటీసులు ఇచ్చింది. పులివెందులలోని భాస్కర్‌ రెడ్డి ఇంటికి వెళ్లిన సిబిఐ అధికారులు విచారణకు హాజరు కావాలని నోటీసులు అందజేశారు.
 
మార్చి 12వ తేదీన ఉదయం 10 గంటలకు కడప సెంట్రల్ జైలు గెస్ట్‌ హౌస్‌లో జరిగే విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
వివేకా హత్య కేసులో సీబీఐ విచారణను ముమ్మరం చేసింది. వివేకా హత్య కేసులో ఇప్పటికే వైఎస్‌ భాస్కర్‌రెడ్డి కుమారుడు, కడప ఎంపీ అవినాష్‌రెడ్డిని హైదరాబాద్‌ సీబీఐ కార్యాలయంలో రెండుసార్లు విచారించింది.
 
తాజాగా అవినాష్‌ రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డిని విచారించడానికి నోటీసులిచ్చింది. వివేకా హత్య జరిగిన రోజు ఘటనాస్థలంలో సాక్ష్యాధారాలు చెరిపేయడంతో పాటు కేసులో భారీ కుట్ర కోణం దాగి ఉందనే అనుమానాలు నివృత్తి చేసుకునేందుకు భాస్కర్‌రెడ్డిని విచారణకు పిలిచినట్లు ప్రచారం జరుగుతోంది.  వివేకా హత్య జరగడానికి కొన్ని గంటల ముందు నిందితుడు సునీల్‌యాదవ్‌ భాస్కర్‌రెడ్డి ఇంట్లో ఉన్నట్లు సీబీఐ అధికారులు గూగుల్‌ టేక్‌ అవుట్‌ ద్వారా నిర్ధారణ చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో సీబీఐ విచారణపై ఉత్కంఠ నెలకొంది. పిభ్రవరి 23న విచారణకు రావాలని సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఆ సమయంలో తనకు ఇతరత్రా కార్యక్రమాలు ఉన్నందున రాలేనని భాస్కర్‌ రెడ్డి సమాధానమిచ్చారు. దీనిపై గడువు ఇచ్చిన సీబీఐ మరోసారి నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలని కోరింది. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డిని సీబీఐ విచారించడంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

 వైఎస్ వివేకా హత్య కేసులో భాస్కరరెడ్డిని సీబీఐ సూత్రధారిగా భావిస్తోంది. గత నెల 26 సీబీఐ బృందం సైతం కడపకు చేరుకున్న నేపథ్యంలో విచారణకు రమ్మంటే వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానంటూ ఆయన సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌కు మెసేజ్‌ పెట్టడంతో పాటు ఫోను కూడా చేసినట్లు తెలుస్తోంది. దీనిపై సిబిఐ అధికారుల నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో విచారణ ఆగిపోయింది.