జైలుకెళ్లిన ఇద్దరు ఢిల్లీ మంత్రుల రాజీనామా

ఢిల్లీ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మనీష్  సిసోడియా, మంత్రిగా ఉన్న సత్యేంద్ర జైన్ తమ పదవులకు రాజీనామా చేశారు. అవినీతి ఆరోపణలపై అరెస్టైన ఆ ఇద్దరు మంత్రుల రాజీనామాలను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆమోదించారు.

ఇద్దరు సీనియర్ మంత్రుల రాజీనామాల నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ త్వరలో మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. అరెస్టయిన నాయకులు ఇంకా ఢిల్లీ ప్రభుత్వంలో ఎలా ఉన్నారంటూ బీజేపీ ప్రశ్నించిన తర్వాత వారు రాజీనామాలు సమర్పించారని తెలుస్తున్నది.

రద్దయిన ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆదివారం సిసోడియాను సిబిఐ అరెస్టు చేయగా, మనీలాండరింగ్‌ కేసులో సత్యేందర్‌ జైన్‌ను గత ఏడాది మేలో ఇడి అరెస్టు చేసింది. జైన్‌ ప్రస్తుతం తీహార్‌ జైలులో ఉన్నారు. మనీశ్ సిసోడియా రాజీనామా అనంతరం ఆయన నిర్వహిస్తున్న కీలకమైన ఆర్థిక శాఖ సహా 18 శాఖలను కైలాశ్ గహ్లోత్, రాజ్ కుమార్ ఆనంద్ లకు అప్పగించారు.

 ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వంలో సీఎం కేజ్రీవాల్ సహా ఐదుగురు మంత్రులు మాత్రమే ఉన్నారు. గతేడాది మనీలాండరింగ్ కేసులో సత్యేంద్ర జైన్‌ను ఈడీ అరెస్టు చేసింది. దీంతో సిసోడియాకు 18 శాఖలు కేటాయించగా.. పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్‌కు మూడు శాఖలు ఇచ్చారు.

ఇప్పుడు సిసోడియా కూడా అరెస్ట్‌ కావడంతో కేజ్రీవాల్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఏం చేయాలో అర్థంకానీ పరిస్థితిలో ఉన్నారు. కొద్ది రోజుల్లో మరిన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనుండడంతో కేజ్రీవాల్‌ వచ్చే నెలలో కర్ణాటక,  ఛత్తీస్‌గడ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. ఇలాంటి సమయంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ అరెస్టులు, ఆ తర్వాత సిసోడియా రాజీనామా పార్టీ విస్తరణకు పెద్ద దెబ్బేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇలా ఉండగా, లిక్కర్‌ స్కామ్‌లో అరెస్ట్‌యిన మనీశ్‌ సిసోడియాకు సుప్రీంకోర్టులోనూ చుక్కెదురైంది. సీబీఐ తనను అరెస్ట్‌ చేయడంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన సిసోడియా పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. సుప్రీంకోర్టు నేరుగా జోక్యం చేసుకుంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న సీజేఐ డీవై చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు.

ఇక సీసోడియా తరఫున అభిషేక్‌ సింఘ్వి వాదనాలు వినిపించారు. సిసోడియా అరెస్ట్ అక్రమమని సింఘ్వి వాదించారు. సిసోడియా ఎక్కడకు పారిపోవడం లేదని కోర్టుకు తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వంలో 18పోర్ట్‌ఫోలియోలు సిసోడియాకు ఉన్నయన్న విషయన్ని సింఘ్వి సుప్రీంకోర్టుకు చెప్పారు. అయితే ఢిల్లీ హైకోర్టుకు ఎందుకు వెళ్లకూడదని సింఘ్విని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దీంతో బుధవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించే ఆలోచనలో సిసోడియా లాయర్ ఉన్నట్లు తెలుస్తోంది.